కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రాక సందర్భంగా హైదరాబాద్ ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కావడం సంచలనం కలిగించింది. కేవలం సినిమాల గురించే వారిద్దరూ మాట్లాడుకొన్నారని కిషన్ రెడ్డి, ఇతర బిజెపి నాయకులు చెప్పినా రాజకీయ అంశాలు సహితం ప్రస్తావనకు వచ్చిన్నట్లు డా. కె లక్ష్మణ్ స్పష్టంగా చెప్పారు.
తెలంగాణాలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి వ్యూహాత్మకంగా ఈ భేటీ ఏర్పాటు చేయించినట్లు, అందుకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి సహకరించినట్లు తెలుస్తున్నది. అయితే బిజెపిని జాతీయ స్థాయిలో ఎదుర్కొంటా అని కాలుదువ్వుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో ప్రేక్షక పాత్ర వహిస్తారని ఎవ్వరూ భావించలేము.
బాలీవుడ్ నుంచి ఈ నెల 9న విడుదలకు ముస్తాబవుతున్న మరో భారీ బడ్జెట్ మూవీ ‘బ్రహ్మస్త్ర’ ప్రచారం కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం స్టూడియోలో భారీ స్థాయిలో శనివారం జరుగవలసిన ప్రీ-రిలీజ్ ఉత్సవం ఆకస్మికంగా రద్దుకావడం యాదృచిక్కం కాదని తెలుస్తున్నది. నగరంలో గణపతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో తగు బందోబస్తు చేయలేమ నిరాచకొండ పోలీసులు చేతులెత్తేయడంతో రద్దవడం గమనార్హం.
వివాదాస్పద కామెడీ షో కు రెండు వేలమందితో భారీ బందోబస్తు ఇవ్వగలిగిన పోలీసులకు రామోజీ ఫిలిం స్టూడియోలో ఇవ్వడం కష్టం కాకపోవచ్చు రాజకీయ కారణాలవల్లనే ఇవ్వలేదని పలువురు భావిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిధిగా పాల్గొనవలసి ఉండడం, ఆ చిత్రంకు తెలుగులో సహా సమర్పకుడిగా రాజమౌళి ఉండడంతో కేసీఆర్ ప్రభుత్వం `తన ప్రతాపం’ చూపిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు సహితం మధ్యలో పోలీసులు అడ్డంకులు కల్పించడం, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా పాల్గొనే బహిరంగసభకు అనుమతి నిరాకరించడం చేస్తే బిజెపి రాష్ట్ర హైకోర్టు నుండి అనుమతి పొందడం తెలిసిందే. వ్యూహాత్మకంగా చాలాకాలంగా రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాను కలసి అనవసరపు వివాదంలో ఇరుక్కున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఇప్పటికే బాయ్‌కాట్ ట్రెండ్‌తో బాలీవుడ్ బలవుతున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం పడి ఇప్పటికే స్టార్ హీరోలు ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్స్ గా మిగిలిపోయాయి. పెట్టిన పెట్టుబడిలో సగం కలెక్షన్లను కూడా రాబట్టలేని స్థితికి వెళ్లిపోయాయి.
ఇప్పుడు బాలీవుడ్ నుంచి మరో భారీ బడ్జెట్ మూవీ ‘బ్రహ్మస్త్ర’ ని కూడా ఈ బాయ్‌కాట్ ట్రెండ్ వెంటాడుతోంది. ఈ సినిమాలోని హీరో హీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ స్టార్ కిడ్స్ కావడం, `నచ్చకపోతే సినిమా చూడకండి’ అని ఆలియా పొగరుగా మాట్లాడడం.. నెపోటిజాన్ని ఎంకరేజ్ చేసే కరణ్ జోహార్ నిర్మాత కావడంతో ఈ సినిమాని కూడా బాయ్‌కాట్ చేయాలని ట్రెండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో తెలుగులో సాహసమర్పకుడిగా పెట్టుబడులు పెట్టిన రాజమౌళి ప్రీ-రిలీజ్ ఉత్సవంకు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించి ఆయన అభిమానులను ఆకట్టుకోవాలని చేస్తున్న ప్రయత్నంకు ఇప్పుడు ఆటంకం కలిగినట్లయింది.