సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 17న ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతిక వ్యవహారాలు, హోంశాఖల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించనుంది.
ఈ ఉత్సవాల్లో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై పాల్గొననున్నారు.
ఈ ఉత్సవాలను హైదరాబాద్ స్టేట్ విలీన దినోత్సవంగా కాకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ శాఖలు భావిస్తున్నట్లు సమాచారం. పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర హోంశాఖ పరిధిలోని ఏడు సాయుధ దళాలతో నిర్వహించే సైనిక కవాతు సందర్భంగా అమిత్ షా సైనిక వందనం స్వీకరించనున్నారు.
మరోవంక, నిజాం పాలన నుంచి తెలంగాణకు స్వాతంత్రం లభించి 75 ఏళ్లు నిండనున్న సందర్భంగా పక్షం రోజుల పాటు వజ్రోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయించింది.
సైనిక కవాతుతో పాటు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గతంలో హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న వివిధ ప్రాంతాలు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలలో విలీనమైన విషయం తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో కేంద్ర సాంస్కృతికశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరోవంక,‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ తరహాలో ఈ నెల 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 దాకా (హైదరాబాద్ స్టేట్ విలీనమై 75 ఏళ్లు పూర్తయ్యే దాకా) ఏడాదిపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నైజాం విముక్త స్వతంత్ర ఉత్సవాల పేరిట చేపట్టాలని రాష్ట్ర స్వయం సేవక్‌సంఘ్ (ఆరెస్సెస్) నిర్ణయించింది.