టాటా గ్రూప్ మాజీ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ ఆదివారం ముంబై సమీపంలోని పాల్ఘర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. అహ్మదాబాద్ నుండి ముంబై వస్తుండగా ఆయన కారు డివైడర్ ను ఢీకొట్టింది. పాల్ఘర్లోని సూర్య నదిపై ఉన్న వంతెనపై ప్రమాదం జరిగినట్టు తెలిసింది.
ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీ అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. సైరస్ మిస్త్రీతో పాటు ముగ్గురు వ్యక్తులు ఆ కారులో ప్రయాణిస్తున్నారు. మిస్త్రీతో పాటు మరో వ్యక్తి కూడా మరణించినట్టు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు గాయాలకు గురికాగా వారిని వెంటనే గుజరాత్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు.
1968 జులై 4న ముంబైలో పల్లోంజి మిస్త్రీ, పాట్ పెరిన్ దుబాష్ దంపతులకు సైరస్ మిస్త్రీ జన్మించారు. లండన్ ఇంపీరియల్ కాలేజ్‌లో బిజినెస్ స్కూల్ మేనేజ్మెంట్లో ఎంఎంసీ చేసిన ఆయన 1991లో తన ఫ్యామిలికి చెందిన ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
సైరస్ మిస్త్రీకి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. 2012లో రతన్ టాటా దిగిపోయాక సైరస్ మిస్త్రీయే టాటాసన్స్ కాంగ్లోమెరేట్స్ను ముందుకు నడిపించారు. టాటా సన్స్‌లో ఎక్కువ వాటాను కలిగి ఉన్న కారణంగా షాపూర్జీ పలోన్జీ గ్రూప్‌కు చెందిన సైరస్ పల్లోన్జీ మిస్త్రీని చైర్మన్‌గా చేశారు. ఆయన టాటా సన్స్ బోర్డులో 2006లో చేరారు.
2012 నుంచి 2016 మధ్య కాలంలో సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్‌కి ఛైర్మన్‌గా ఉన్నారు. కానీ 2016 అక్టోబర్‌లో సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్ అర్థాంతరంగా ఛైర్మన్ పదవి నుంచి తొలగించింది. సైరస్ మిస్త్రీ సంస్థ నిర్ధేశించిన లక్ష్యాల్ని చేరడంలో విఫలమయ్యారని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో సైరస్ మిస్త్రీ ఏళ్ల పాటు టాటా గ్రూప్‌తో పోరాడారు.
సైరస్ మిస్త్రీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిస్త్రీ మరణం వాణిజ్య, పారిశ్రామిక ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
“సైరస్ మిస్త్రీ అకాల మరణం దిగ్భ్రాంతికరం. ఆయన భారతదేశ ఆర్థిక పరాక్రమాన్ని విశ్వసించిన మంచి వ్యాపారవేత్త. ఆయన మరణం వాణిజ్య, పారిశ్రామిక ప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’ అని మిస్త్రీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.