కుండపోత వర్షం భారతదేశంలోని సిలికాన్‌వ్యాలీ అయిన బెంగళూరుని సరస్సుగా మార్చివేసింది. భారీ వర్షం అలా కురుస్తూనే ఉంది. వరదలాంటి పరిస్థితుల మధ్య చాలా ప్రాంతాలు జలాశయాలను తలపిస్తున్నాయి. పలు నివాస ప్రాంతాలు నీట మునిగి ఉండడంతో బెంగళూరు వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సోమవారం తెల్లవారుజాము నుంచే బెంగళూరు నగరంలో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.
ముఖ్యంగా బెల్లందూర్, సర్జాపురా రోడ్, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్‌రోడ్డు, బిఇఎంఎల్ లే అవుట్ వంటి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. దీంతో అధికారులు అక్కడ ప్రజలను ఖాళీ చేయించేందుకు తెప్పలను పంపారు. ట్విటర్లో, నెటిజన్లు జలమయమైన రోడ్ల చిత్రాలను, వీడియోలను పంచుకుంటున్నారు.
బెల్లందూర్ సమీపంలోని ఎకోస్పేస్ వద్ద పరిస్థితి భయానకరంగా ఉంది. వాహనాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడంలేదని ఆందోళనచెందుతున్నారు. గంటల తరబడి వర్షం అనేక ప్రాంతాలను ముంచెత్తిన ఫొటోలను స్థానికులు నెట్టింట పోస్ట్ చేస్తున్నారు.
వీటిలో మారతహల్లిలోని స్పైస్గార్డెన్ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. స్పైస్ గార్డెన్ నుంచి వైట్‌ఫీల్డ్‌కు వెళ్లే రహదారిని బ్లాక్ చేశారు. బెల్లందూర్ ఔటర్ రింగ్రోడ్డలో నీరు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు పేర్కొన్నారు.
వరద నీరు ఇళ్లలోకి చొరబడటంలో కొన్ని ఇళ్లల్లో ఏకంగా రిఫ్రిజిరేటర్లు నీటిలో తేలుతున్నాయి. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం బెంగళూరులో సోమవారం 12.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సంవత్సరం మార్చి నుండి ఇప్పటివరకు బెంగళూరులో 1,091 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.కాగా, కర్ణాటకలో మరో ఐదు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నెల 9 వరకూ ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తా ప్రాంతంలో మత్స్యకారులు సముద్రం లోపలికి వెళ్లడం మంచిది కాదని సూచించింది.
కొడగు, ఉత్తర కన్నడ, శివమొగ్గ, ఉడుపి, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు.
బెంగళూరు నగరం సహా కనీసం పది జిల్లాల్లో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బెంగళూరు నగరంలోనూ ఈ నెల 9 వరకూ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
గత మంగళవారం ఇదే విధంగా భారీ వర్షాలతో నగరం లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లుకూలిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. ఫలితంగా కొన్ని వందల కోట్ల నష్టానికి దారి తీసిందని ఐటి, బ్యాంకింగ్ సంస్థలు ముఖ్యమంత్రికి ఒక లేఖ ద్వారా తెలియజేశాయి.
నీరు నిల్చిపోవడంతో ఏర్పడిన నష్టాలపై ఐటి కంపెనీలతో చర్చిస్తానని, ఈమేరకు నష్టపరిహారం అందేలా ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. ఈనెల 9 వరకు కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరు, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది.