తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిజామాబాద్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణల పట్ల బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అవి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు.
జాతీయ రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకునే హక్కు కేసీఆర్ కు ఉందని, కానీ దానిని అడ్డం పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు ప్రచారం చేయడం సరైంది కాదని హితవు చెప్పారు. కేసీఆర్ అసంబద్ధ విధానాలతో ఇప్పటికే తెలంగాణ డిస్కమ్‌లను అప్పుల ఊబిలో కూరుకుపోయాయని ఆయన పేర్కొన్నారు.
అది చాలదన్నట్టు జాతీయ స్థాయిలోని సంస్థలను దివాళా తీయించాలని కేసీఆర్ చూస్తున్నాడని ధ్వజమెత్తారు. వ్యవసాయ పంపులకు మీటర్లు పెడుతారన్న దాని గురించి కేసీఆర్ తప్పితే ఎవరూ మాట్లాడడం లేదని అంటూ కేసీఆర్ మాత్రం ప్రతి మీటింగులో మోటార్లకు మీటర్ల పెడుతారంటూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
పదేపదే ఒకే అబద్ధాన్ని చెప్తే ప్రజలు అది నిజమని భావిస్తారనేది కేసీఆర్ ఆలోచనలా కనిపిస్తోందని, కాని ప్రజలు వాస్తవానికి, అబద్ధానికి తేడా తెలియని అమాయకులు కాదని తరుణ్ ఛుగ్ స్పష్టం చేశారు. ఏ తప్పూ చేయకుంటే కేసీఆర్ సీబీఐ, ఈడీలను ఎందుకు పదేపదే ప్రస్తావిస్తున్నాడు? అని ప్రశ్నించారు.
కేవలం భయంతో సీబీఐ, ఈడీ పేర్లను జపిస్తున్నాడని అంటూ ఒకవేళ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతారు? అని నిలదీశారు. సీబీఐ, ఈడీలకు భయపడనని పదే పదే చెప్పడంలోనే ఆయనలో నెలకొన్న భయానికి అద్దం పడుతోందని స్పష్టం చేశారు. కేసీఆర్ వ్యవహారశైలి చూస్తుంటే అతను తప్పు చేసినట్టు రూఢీ అవుతోందని, పైగా భయపడుతున్నట్టూ తెలుస్తోందని స్పష్టం చేశారు.
కేసీఆర్ కు రాజ్యాంగ వ్యవస్థలపైనా నమ్మకం లేనట్లుంది. నేరస్థులను పట్టుకునేందుకు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలు సీబీఐ, ఈడీలను పదేపదే వివాదాల్లో లాగి, వారిని భయభ్రాంతులకు గురిచేయాలని కేసీఆర్ చూస్తున్నారు. కాని కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరు. వాస్తవాలను బట్టే వారు తమ పని కొనసాగిస్తారు.
ఇక కేసీఆర్ కు తెలంగాణలో స్థానం లేదని, తెలంగాణ ప్రజలు ఆయనకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారని తరుణ్ ఛుగ్ స్పష్టం చేశారు. ఈ విషయం ఆయనకూ అర్థమైంది గనుకనే ఆయన దిల్లీ వెళ్దామనుకుంటున్నారని తెలిపారు. సొంత రాష్ట్రంలో స్థానం లేని వ్యక్తికి దిల్లీ ఎలా స్వాగతం పలుకుతుంది? అని ఎద్దేవా చేశారు.
దేశంలో బిజెపికి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ దిల్లీలో చాలామందే పెద్ద క్యూ కట్టారని అంటూ కేసీఆర్ కూడా ఆ క్యూలో నిల్చొవచ్చని సూచించారు. కాని ప్రచారం కోసం చట్టబద్ధమైన సంస్థలను రాజకీయాల్లోకి లాగడం సరైంది కాదని, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని స్పష్టం చేశారు.