2025 నాటికి భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగం 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో “సీజింగ్ ది గ్లోబల్ ఆపర్చునిటీ” పై జరిగిన 14వ సిఐఐ గ్లోబల్ మెడ్ టెక్ సమ్మిట్ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో గత రెండేళ్లలో ఆరోగ్య సంరక్షణ రంగం ఇన్నోవేషన్, టెక్నాలజీపై మరింత దృష్టి సారించిందని చెప్పారు.
రాబోయే ఐదేళ్లలో డిజిటల్ హెల్త్ కేర్ టూల్స్ లో తమ పెట్టుబడులను పెంచుకోవాలని 80 శాతం హెల్త్ కేర్ సిస్టమ్స్ లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆయన వెల్లడించారు. 2025 నాటికి టెలిమెడిసిన్ కూడా 5.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సాంకేతిక జోక్యం తో రూపొందించిన ఈ సంజీవని, వర్చువల్ డాక్టర్ కన్సల్టేషన్లకు అవకాశం కల్పించిందని, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలను వారి స్వంత ఇళ్ల నుంచి సేవలు పొందేలా ప్రధాన నగరాల్లోని వైద్యులతో అనుసంధానించిందని మంత్రి తెలిపారు.
వచ్చే పదేళ్లలో దిగుమతిపై ఆధారపడటాన్ని 80 శాతం నుంచి 30 శాతం కంటే తక్కువకు తగ్గించడం, మేక్ ఇన్ ఇండియా ద్వారా మెడ్ టెక్ లో 80 శాతం స్వావలంబన ఫలితాన్ని స్మార్ట్ మైలురాళ్లతో అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ దిశగా భారత ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ రంగాన్ని బలోపేతం చేయడం కోసం నిర్మాణాత్మక మైన, సుస్థిరమైన సంస్కరణల ను చేపట్టిందని, ఎఫ్ డి ఐల ను ప్రోత్సహించడానికి అనువైన విధానాలను కూడా ప్రకటించిందని ఆయన తెలిపారు.
‘‘ఇది ధోరణిలో మార్పుకు దారితీసింది, దేశం మెడ్ టెక్ సృజనాత్మకతకు కేంద్రంగా మారింది. పాశ్చాత్య ఉత్పత్తులను స్వీకరించడానికి బదులుగా, భారతీయ ఆవిష్కర్తలు వినూత్న మెడ్ టెక్ ఉత్పత్తులు, పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నారు. హెల్త్ టెక్/ మెడ్ టెక్ ఎకోసిస్టమ్ వేగవంతమైన విస్తరణకు దారితీసే ఒక మార్పు దశకు భారతదేశం చేరుకుంది‘‘ అని కేంద్ర మంత్రి వివరించారు.
ఈ రంగంలో విపరీతమైన పెరుగుదలకు అవసరమైన అన్ని వనరులను భారత్ కలిగి ఉందని, వీటిలో పెద్ద జనాభా, బలమైన ఫార్మా , మెడికల్ సప్లై చైన్, 750 మిలియన్లకు పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు, ప్రపంచవ్యాప్తంగా విసి ఫండింగ్ తో మూడవ అతిపెద్ద స్టార్టప్ పూల్, ప్రపంచ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి చూస్తున్న సృజనాత్మక టెక్ వ్యవస్థాపకులు ఉన్నట్లు తెలిపారు.