కర్ణాటక హిజాబ్ నిషేధం కేసు కేవలం పాఠశాలల్లో నిబంధనల గురించి మాత్రమేనని సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఎక్కడా, ఏ ప్రాంతంలోనూ హిజాబ్‌పై నిషేధం విధించలేదని తెలిపింది. కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల విచారణలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19, 21, 25 ప్రకారం ఒక బాలికకు హిజాబ్ ధరించే హక్కు ఉందని పిటీషనర్లు వాదించారు.
దీనికి స్పందిస్తూ జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు దులియా ధర్మాసనం ‘హిజాబ్ ధరించకుండా మిమ్మల్ని ఎవ్వరూ నిషేధించలేదు. మీరు కోరుకుంటే ఎప్పుడైనా ధరించవచ్చు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే పాఠశాలల్లో నిబంధనల గురించి. దాని గురించే మేం ఆందోళన చెందుతున్నాం’ అని తెలిపింది.
దీనికి సమాధానంగా పిటీషనర్ల తరపున న్యాయవాది ‘పాఠశాలల్లో యూనిఫాం నిబంధనలను మేం సవాలు చేయడం లేదు’ అని తెలిపారు. ముస్లిం బాలికలు తలకు స్కార్ఫ్ ధరించడానికి కేంద్రీయ విద్యాలయం అనుమతిస్తుందని గుర్తుచేశారు. గురువారం కూడా ఈ కేసు విచారణ జరగనుంది.
వాదోపవాదనలు సమయంలో జస్టిస్ హేమంత్ గుప్తా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించే హక్కుపై వాదిస్తున్న లాయర్‌ను ఉద్దేశించి….”ఈ అంశాన్ని మీరు ఒక అశాస్త్రీయమైన ముగింపు వైపు తీసుకెళ్లకూడదు. డ్రస్ వేసుకునే హక్కు ఉందంటే డ్రస్ విప్పేసే హక్కు కూడా ఉంటుందనా?” అని ప్రశ్నించారు. దీనికి దేవ్ దత్ కామత్ వెంటనే స్పందించారు. ”పాఠశాలలో ఎవరూ కూడా బట్టలు విప్పరు” అని ఆయన సమాధానమిచ్చారు.
చాలా మంది విద్యార్థులు రుద్రాక్ష, శిలువ వంటి మతపరమైన గుర్తులు ధరిస్తున్నారని న్యాయవాది చెప్పగా, వాటిని వారు షర్టు లోపల ధరిస్తున్నారని, రుద్రాక్ష ధరించారా లేదా అనేందుకు ఎవరూ చొక్కా పెకెత్తి చూడరని జస్టిస్ గుప్తా గుర్తు చేశారు.
జస్టిస్ హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాతో కూడిని ధర్మాసనం గత సోమవారం ఒక కీలక అంశాన్ని ప్రస్తావించింది. ”మీకు మతపరమైన హక్కు ఉందనుకుంటే మీరు అనుకున్న ప్రకారం చేసుకోవచ్చు. కానీ మీరు ఆ హక్కును పాఠశాల వరకూ తీసుకువెళ్లవచ్చా? పాఠశాలకు ఒక యూనిఫాం అనేది ఉంటుంది. అవునా, కాదా అనేదే ప్రశ్న. మనది లౌకిక దేశం అంటూ రాజ్యాంగ పీఠిక చెప్పిందన్న కారణంగా మీ మతపరమైన సంప్రదాయం ప్రభుత్వ సంస్థల్లో కూడా కొనసాగాలని పట్టుబట్టవచ్చా? అని ప్రశ్నించింది.