ఢిల్లీలో రాజ్ పథ్ కు నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్చిన ‘కర్తవ్య పథ్ ‘ పేరు భారతీయత ఉట్టిపడే పేరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం ప్రకటించారు. ‘కర్తవ్య పథ్ ‘లో నేతాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించడం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు.
5 ఏళ్లు గడచినా వలసవాద పాలనకు ఇంకా మానని గాయాలుగా ఉన్న చిహ్నాలను చెరిపివేస్తున్న ప్రధాని మోదీ అభినందనీయులు అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బ్రిటీష్ పాలనలో కింగ్స్ వే, ఆపై రాజ్ పాథ్ గా మారి, ఇప్పుడు కర్తవ్య పథ్ గా అవతరించిందని పవన్ కల్యాణ్ వివరించారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంకల్పంతో, వలసవాద పాలనలో ఉద్భవించిన పేర్లు, చిహ్నాలను తొలగించాలని ప్రధాని మోదీ ఉద్ఘాటించారని సంతోషం ప్రకటించారు. ఆ వాగ్దానాన్ని అమలు చేస్తుండడం హర్షణీయం అని ఆయన తెలిపారు.
ఢిల్లీలో ప్రధాని అధికారిక నివాసం ఉండే వీధిని రేస్ కోర్స్ రోడ్ గా పిలిచేవారని, ఇప్పుడది లోక్ కల్యాణ్ మార్గ్ గా నామకరణం చేశారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అంతేకాకుండా, భారత నావికాదళ పతాకంలో సెయింట్ జార్జ్ క్రాస్ ఉండేదని, దాని స్థానంలో నూతన పతాకాన్ని మోదీ ఆవిష్కరించారని తెలిపారు. ఈ గుణాత్మక చర్యలు బానిస వాదాన్ని నిర్మూలించే అభ్యుదయ చర్యలుగా భావిస్తున్నానని తెలిపారు.
అదేవిధంగా, జపాన్లో భద్రపరచిన ఆయన అస్థికలను కూడా ప్రధాని తెప్పించాలని ఆయన కోరారు. ‘కర్తవ్య పథ్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మీ చేతుల మీదుగానే, జపాన్ లో భద్రపరిచిన ఆయన అస్థికలను కూడా రప్పించాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ విజ్ఞప్తి చేశారు.
నేతాజీ మనుమరాలు రాజశ్రీ చౌదరి బోస్ అనుమతితో ఆమె డీఎన్ఏతో ఆ అస్థికలను పోల్చాలని కూడా ఆయన కోరారు. ఇది సాకారమైతే ఆజాదీ అమృత్ మహోత్సవ్ లక్ష్యం సిద్ధిస్తుందని తెలిపారు. భారత జాతి విముక్తి కోసం పోరాడిన ఆ మహనీయునికి నివాళిగా మిగిలిపోతుందని వివరించారు.