సుదీర్ఘకాలం బ్రిటన్ను పాలించి, గురువారం కన్నుమూసిన మహారాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు వెస్ట్ మినిస్టర్ అబెలో అశేష జనవాహిని మధ్యలో ఈ నెల 19న జరగనున్నాయి. ఆమె మరణించిన స్కాటిష్ ఎస్టేట్‌లోనే రాయల్ స్టాండర్డ్ పతాకాన్ని కప్పిన శవపేటికలో ఆమె భౌతిక కాయాన్ని వుంచారు. ఆ తర్వాత రాణి వయస్సు 96 సంవత్సరాలకు గుర్తుగా 96 రౌండ్లు తుపాకులను గాల్లోకి పేల్చారు.
సెయింట్ పాల్స్ కేథడ్రల్ వద్ద జరిగిన నివాళి కార్యక్రమానికి ప్రధాని లిజ్‌ట్రస్, ఇతర సీనియర్ మంత్రులు హాజరై నివాళులర్పించారు. శనివారం ఎలిజబెత్ కుమారుడు చార్లెస్‌ను రాజుగా ప్రకటించిన తర్వాత, ఆదివారం రాణి భౌతిక కాయాన్ని వుంచిన శవపేటికను బాల్మోరల్ నుంచి ఆమె అధికార స్కాటిష్ నివాసమైన హౌలీరూడ్హౌస్ ప్యాలెస్‌కి తరలిస్తారు. ప్రజలు నివాళి అర్పించేందుకు వీలుగా రోడ్డు పై నుండి అంతిమయాత్ర సాగుతుంది.
అక్కడ మూడు రోజుల పాటు ప్రజల సందర్శనార్ధం వుంచుతారు. అనంతరం తండ్రి జార్జి-4, తల్లి ఎలిజబెత్, భర్త ప్రిన్స్ ఫిలిప్ సమాధుల పక్కనే రాణి అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. రాణి ఎలిజబెత్-2 మృతిపై ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ సహా అమెరికా, ఫ్రాన్స్, చైనా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తదితర దేశాల నేతలు రాణితో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపాలు తెలియజేశారు. బ్రిటన్ రాజకుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
గ్రేట్ బ్రిటన్ సహా ఆస్ట్రేలియా, కెనడా, జమైకాలతో కూడిన 14 కామన్వెల్త్ దేశాలకు ఆమె అధినేతగా పాలన సాగించారు. తన జీవితాంతం ఆమె ప్రజల సేవలోనే గడిపారని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని బ్రిటీష్ ఎంబసీల్లో పతాకాలను అవనతం చేశారు. ఆమె మృతి దేశానికి, ప్రపంచానికి తీరని లోటని బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ వ్యాఖ్యానించారు.
ఆమె నాయకత్వంలో బ్రిటీష్ జాతికి స్ఫూర్తినందించారని ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మృతి వార్త తెలిసిన వెంటనే వాషింగ్టన్‌లోని బ్రిటీష్ ఎంబసీకి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆయన సతీమణి అక్కడ సంతాప సందేశం పుస్తకంలో సంతకాలు చేశారు.