రాజకీయ సుస్థిరత, పరిపాలన సామర్థ్యం కోసం బలమైన ప్రధానులు లేదా ముఖ్యమంత్రులు, ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ గల ప్రభుత్వాలను కోరుకొంటుంటాము. కానీ హైదరాబాద్ లోని పాతబస్తీకి మాత్రమే పరిమితంగా గల బలంతో జాతీయస్థాయి నాయకునిగా చెలామణి అవుతున్నమజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బలహీనమైన ప్రధాని, కిచిడి ప్రభుత్వం నేడు దేశానికి అవసరం అని పిలుపిచ్చారు.
శక్తిమంతుడైన ప్రధాని కేవలం శక్తిమంతులకే తోడ్పడతాడని, కనుక బలహీన ప్రధాని దేశానికి అవసరం అని, ఎందుకంటే బలహీన ప్రధానే బలహీనులకు సాయపడగలడని అంటూ `విచిత్రమైన’ సిద్ధాంతీకరణ చేశారు. సంకీర్ణ ప్రభుత్వాలతో అస్థిర ప్రభుత్వాల పనితీరును ప్రజలు ఇంకా మరచిపోలేదు. అయినా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ‘కిచిడీ’ ప్రభుత్వం వస్తేనే మంచిదని కూడా ఆయన చెప్పారు.
‘ఆప్’ పార్టీ అధికారంలో ఉన్న బిజెపికి భిన్నమైనదేమి కాదని మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్న గుజరాత్ పర్యటన సందర్భంగా తెలిపారు. గుజరాత్లో డిసెంబర్లో జరుగనున్న ఎన్నికల్లో మజ్లీస్ తన అభ్యర్థిని పోటీకి నిలబెడుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు.
తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత శక్తిమంతంగా ఎదిగిన నరేంద్ర మోదీనిని నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, చైనా చొరబాటు, కార్పొరేట్ పన్ను రద్దు, పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణాల గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ‘సిస్టం’ను నిందించారే తప్ప సరైన సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు.
‘అందుకే నేను దేశానికి బలహీన ప్రధాని రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఓ బలహీన ప్రధానే బలహీనులు స్థితిగతులు అర్థం చేసుకుంటాడు. శక్తిమంతుడైన ప్రధాని కేవలం సంపన్నులకే మేలు చేస్తాడు’ అని చెప్పుకొచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ‘కిచిడీ ప్రభుత్వం’ వస్తేనే మేలని అంటూ ఏమవుతుందో వేచి చూద్దాం అని నిర్వేదం వ్యక్తం చేశారు.
నితీశ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే అది బిజెపికి ప్రయోజనం కాగలదని, అలాకాక అందరం కలసికట్టుగా మోదీకి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉందని పేర్కొంటూ పరోక్షంగా రాహుల్ గాంధీకి మద్దతు అన్న సంకేతం ఇచ్చారు. 2020లో గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు నితీశ్ కుమార్ బిజెపితో పొత్తు కుదుర్చుకున్నాడని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలు నేడు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విద్య, వైద్యం వంటి విషయాలను పక్కకు పెట్టేసి హిందుత్వనే ముఖ్యాంశంగా మార్చేశాయని విమర్శించారు.