అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న స్థానంలోనే రామమందిరం ఉండేదని గుర్తించి, అందుకు సంబంధించిన ఆధారాలు వెలికితీసిన ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త బ్రజ్ బాసిలాల్ అలియాస్ బీబీ లాల్ (101) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న బీబీ లాల్ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
బీబీలాల్ మే 2, 1921న ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీ జిల్లాలోని బడోరా గ్రామంలో జన్మించారు. సివ్లూలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ డైరెక్టర్గా సేవలందించారు. 1968 నుంచి 1972 వరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అత్యంత పిన్నవయస్సులో డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. యునెస్కోలో వివిధ కమిటీలలో కూడా పాల్గొన్నాడు. కు బీబీలాల్ నాయకత్వం వహించారు. ఆ ప్రదేశంలో ఒక పురాతన దేవాలయం ఉందని నిరూపించారు. తదనంతరం ఆలయానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
బీబీలాల్ మహాభారతం, రామాయణం సంబంధించి సింధు లోయ, కాళీబంగన్కు సంబంధించిన ప్రదేశాలలో విస్తృతంగా పరిశోధనలు చేశారు. బీబీలాల్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. బీబీలాల్తో తాను సమావేశమైన చిత్రాన్ని పంచుకుంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
”బీబీ లాల్ ఒక అద్భుతమైన వ్యక్తిత్వం, సంస్కృతి, పురావస్తు శాస్త్రానికి ఆయన చేసిన కృషి అసమానమైనది. మన సుసంపన్నమైన గతంతో మన అనుబంధాన్ని మరింతగా పెంచుకున్న గొప్ప మేధావిగా ఆయన గుర్తుండిపోతారు. ఆయన మరణం నన్ను కలిచివేసింది” అని పేర్కొన్నారు. బీబీలాల్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కూడా బిబి లాల్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. లాల్ మృతితో దేశం ఒక గొప్ప మేధావిని కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు.