ఆప్ ప్రభుత్వానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె.సక్సేనాల మధ్య వివాదాలు మరింత ముదురుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం వెయ్యి లోఫ్లోర్ బస్సుల కొనుగోలుపై సిబిఐ విచారణకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఆమోదం తెలిపి, విచారణ బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి అప్పగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
చీఫ్ సెక్రటరీ నరేష్కుమార్ సూచన మేరకు ఈ కేసును దర్యాప్తు సంస్థకు అ్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భేటీ అయిన సంసగతి తెలిసిందే.
బస్సుల టెండర్లు, కొనుగోలుకు సంబంధించిన కమిటీకి చైర్మన్‌గా ఢిల్లీ రవాణా మంత్రిని నియమించడంతో బస్సుల కొనుగోలులో అవినీతి, అవతవకలు జరిగాయని జూన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్‌కి ఫిర్యాదు అందిందని తెలిపారు. అలాగే బస్సుల కొనుగోలులో అవతవకలను సులభతరం చేసేందుకు ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ (డిఐఎంటిఎస్) ని మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా నియమించినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదును లెప్టినెంట్ గవర్నర్ జులైలో చీఫ్ సెక్రటరీకి పంపారని, ఆగస్టులో చీఫ్ సెక్రటరీ నుండి నివేదిక అందిందని అధికారులు తెలిపారు. టెండర్ల ప్రక్రియలో అవతవకలు జరిగాయని చీఫ్ సెక్రటరీ తన నివేదికలో పేర్కొన్నారు. ఈ అవతవకలు బయటపడకుండా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగా డిఐఎంటిఎస్ను కన్సల్టెంట్‌గా నియమించినట్లు తెలిపారు.
కాగా, ఎల్జీ నిర్ణయాన్ని రాజకీయ ప్రేరేపిత చర్యగా ఆప్ సర్కార్ విమర్శించింది. ముందుగా ఎల్జీ తనపై వచ్చిన అవినీతి అభియోగాల నుంచి సచ్చీలుడుగా బయటపడాలని డిమాండ్ చేసింది. బస్సులను కొనుగోలు చేయలేదని, ఆ టెండర్లు రద్దయ్యాయని తెలిపింది. ఢిల్లికి మరింత విద్యావంతులైన ఎల్జీ అవసరం. ఇప్పటికే ముగ్గురు మంత్రులపై తప్పుడు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో, ఇప్పుడు నాలుగో మంత్రిపై ఎల్జీ ఫిర్యాదు చేశారని ఢిల్లి ప్రభుత్వం పేర్కొంది.