జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదాను కల్పించే విధంగా అధికరణ 370ని భారత రాజ్యాంగంలో మళ్లీ ప్రవేశపెడతామనే హామీని తాను ఇవ్వబోనని జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. తప్పుడు వాగ్దానాలివ్వడం వల్ల ప్రయోజనం కలుగుతుందని తాను విశ్వసించనని చెప్పారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారిగా ఉత్తర కశ్మీరులోని బారాముల్లా పట్టణంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, అధికరణ 370ని పునరుద్ధరించాలంటే లోక్సభలో కనీసం 350 ఓట్లు, రాజ్యసభలో కనీసం 175 ఓట్లు అవసరమని గుర్తు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు ఏ రాజకీయ పార్టీకి లేవని, సమీప భవిష్యత్తులో వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
50 కన్నా తక్కువ స్థానాలకు కాంగ్రెస్ క్షీణించిందని చెబుతూ ఈ నేపథ్యంలో అధికరణ 370ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మాట్లాడితే, ఆ పార్టీ తప్పుడు వాగ్దానం చేస్తున్నట్లేనని ఎద్దేవా చేశారు. తన రాజకీయ ఎజెండాలోని అంశాలను వివరిస్తూ, జమ్మూ-కశ్మీరుకు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, స్థానికులకు భూములు, ఉద్యోగ కల్పనకు హామీ ఇస్తున్నానని ఆజాద్ ప్రకటించారు.
ఇవి సాధించదగిన లక్ష్యాలని భరోసా వ్యక్తం చేశారు. అయితే, అధికరణ 370ని రద్దు చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన తీర్మానాన్ని తాను వ్యతిరేకించానని చెప్పారు. ఈ తీర్మానానికి అనుకూలంగా తాను ఓటు వేసినట్లు కొందరు తనను నిందిస్తున్నారని మండిపడ్డారు. ఈ అధికరణ రద్దును వ్యతిరేకిస్తూ తాను ఓటు వేశానని పేర్కొంటూ పార్లమెంటు పని తీరు గురించి తెలియనివారు తాను ఈ అధికరణకు వ్యతిరేకంగా ఓటు వేశానని ఆరోపిస్తున్నారని వివరించారు.
పదో రోజుల్లో కొత్త పార్టీ కాగా, మరో పది రోజుల్లో కొత్త పార్టీ ని ప్రకటిస్తానని ఆజాద్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు మద్దతు ఇచ్చేవారు ఎన్నో రెట్లు పెరిగినట్టు ప్రకటించారు. జమ్మూలో 30 నుంచి 35 అసెంబ్లీ నియోజకవర్గలా పరిధిలో 400 మందిని కలుసుకున్నట్టు చెప్పారు. వారంతా తనకు మద్దతు తెలిపారని, ఏ పార్టీ అయినా తనతో నడుస్తానని చెప్పినట్టు పేర్కొన్నారు.
కాశ్మీర్లో రాజకీయ దోపిడీ లక్ష మందిని చంపేసి, ఐదు లక్షల మంది పిల్లలను అనాథలుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధాలు, దోపిడీల ఆధారంగా తాను ఓట్లు అడగడడానికి రావడం లేదని స్పష్టం చేశారు. తాను రాజకీయంగా మూల్యం చెల్లించుకోవలసి వచ్చినా సాధ్యమయ్యేది మాత్రమే చెబుతానని తెలిపారు.
కొత్త రాజకీయ పార్టీ ఎజెండాలో రాష్ట్ర పునరుద్ధరణ కోసం పోరాడడం.. ప్రజల ఉద్యోగ, భూమి హక్కుల కోసం పోరాడడంగానే ఉంటుందని తెలిపారు. తాను జమ్మూ-కశ్మీరు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో బూటకపు ఎన్కౌంటర్కు బాధ్యులైన 13 మంది పోలీసులను అరెస్టు చేయించానని తెలిపారు. వారు 15 ఏళ్ళ నుంచి జైలులోనే ఉన్నారని చెప్పారు. అప్పట్లో తాను ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేశానని, వైద్య కళాశాలలను కూడా ఏర్పాటు చేయించానని వివరించారు.