సూపర్‌ఫామ్‌లో ఉన్న శ్రీలంక ఆసియా కప్ 2022 విజేతగా అవతరించింది. ఫైనల్లో పాక్‌పై శ్రీలంక 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. శ్రీలంక బ్యాటర్ భానుక రాజపక్స 6 ఫోర్లు, ౩ సిక్స్‌లతో 71పరుగులు చేసి హాఫ్‌సెంచరీతో ఆకట్టుకోగా బౌలింగ్‌లో మధుషన్ 4 వికెట్లు, హసరంగా 3 వికెట్లుతో పాక్‌ను కుప్పకూల్చారు.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 147 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో శ్రీలంక 23 పరుగుల తేడాతో గెలిచి ఆసియాకప్‌ను కైవ సం చేసుకుంది.
పాక్ వికెట్ కీపర్ రిజ్వాన్ (55) హాఫ్‌సెంచరీ సాధించి ఒంటరి పోరాటం చేసినా పాకిస్థాన్ ఓటమిని తప్పించుకోలేక పోయింది. ఆసియా కప్ 2022 తుదిపోరులో పాక్, శ్రీలంక జట్లు దుబాయ్ వేదికగా తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుని లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
దీంతో నిసాంక, కుశాల్ మెండీస్ శ్రీలంక ఇన్నింగ్స్ ప్రారంభించారు. నసీంషా పాక్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించి తొలి ఓవర్లోనే శ్రీలంకకు షాక్ ఇచ్చాడు. మూడో బంతికి కుశాల్ మెండిస్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. నసీంషా ఇన్‌స్వింగర్‌కు కుశాల్ డకౌట్ అవడంతో లంక 2పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.
కుడి చేతివాటం బ్యాటర్ ధనంజయ క్రీజులోకి వచ్చాడు. అనంతరం నాలుగో ఓవర్లో హరీస్ రవూఫ్ శ్రీలంకకు తనవంతుగా మరో షాక్ ఇచ్చాడు. రవూఫ్ బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించిన నిసాంక పాక్ సిప్పర్ బాబర్ చేతికి దొరికిపోయాడు. 23 పరుగులకే శ్రీలంక ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అనంతరం ఆరో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన రవూఫ్ మరోసారి లంకను దెబ్బతీశాడు. ఈ ఓవర్లో తొలి బంతికే ధనుష్క గుణతిలక (1)ను బౌల్డ్ చేశాడు. ధనంజయకు భానుక రాజపక్స అండగా నిలవడంతో శ్రీలంక పవర్‌ప్లే ముగిసేసరికి మూడు వికెట్లు నష్టానికి 42పరుగులు చేసింది.
ఈ క్రమంలో 8వ ఓవర్లో పాక్ పేసర్ ఇఫ్తికర్ అహ్మద్ నిలకడగా ఆడుతున్న ధనంజయను ఔట్ చేశాడు. 21బంతుల్లో 4ఫోర్లుతో 28పరుగులు చేసిన ధనంజయ..ఇఫ్తికర్‌కు రిటర్న్ క్యాచ్ఇచ్చి వెనుదిరిగాడు. మరుసటి ఓవర్లోనే షనక(2)ను లెగ్ స్పిన్నర్ షాదాబ్‌ఖాన్ బౌల్డ్ చేశాడు.
శ్రీలంక 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. లంక జట్టును ఆదుకున్న హసరంగ, రాజపక్స జోడీని రవూఫ్ విడదీయడంతో 58 పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరపడింది. హసరంగ రవూఫ్ బౌలింగ్‌లో రిజ్వాన్‌కు క్యాచ్ఇచ్చి వెనుదిరిగాడు. శ్రీలంక 116 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది.
ఈ నేపథ్యంలో రాజపక్స హాఫ్‌సెంచరీ నమోదు చేయడంతో శ్రీలంక 170 పరుగుల గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. మొత్తం మీద శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కరుణరత్నే నాటౌట్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో హరిస్ రవూఫ్ 3వికెట్లు తీయగా నసీంషా, షాదాబ్‌ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
శ్రీలంక నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాక్ కెప్టెన్ బాబర్, కీపర్ రిజ్వాన్ ఇన్నింగ్స్ ఆరంభించారు. మధుశంక లంక బౌలింగ్ ఎటాక్‌ను ఆరంభించాడు. నోబాల్‌తో ప్రా రంభించి నాలుగువైడ్లు వేసిన మధుశంక తొలి ఓవర్లోనే 12 పరుగులిచ్చాడు.
తొలి బంతికే పది పరుగులు పాక్ ఖాతాలో చేరడం విశేషం. నాలుగో ఓవర్లో పేసర్ ప్రమోద్ మధుషన్ బౌలింగ్‌లో కెప్టెన్ బాబర్ మధుశంకకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మొత్తంమీద పాక్ 147 పరుగులు చేసి ఆలౌటైంది.