తెలంగాణ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్‌పై అవినీతి ఆరోపణలపై డివోపీటీ వైఖరిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రజత్ కుమార్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని డీఓపీటీని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. రజత్ కుమార్ కుమార్తె వివాహానికి సంబంధించిన బిల్లులను మేఘా సంస్థ చెల్లించిందని డీఓపీటీకి గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
ఆ పిటిషన్ ను తెలంగాణకు బదిలీ చేయడంపై ఢిల్లీ హైకోర్టును ఆయన ఆశ్రయించాడు. స్పెషల్ సీఎస్ స్థాయి అధికారిపై సీఎస్ ఎలా చర్యలు తీసుకుంటారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని డీఓపీటీని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి హైకోర్టు వాయిదా వేసింది.
రజత్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కూడా పిటిషన్లో గవినోళ్ల శ్రీనివాస్ కోరారు. హైదరాబాద్‌లోని పేరొందిన స్టార్ హోటళ్ల వేదికగా ఐదు రోజులపాటు రజత్ కుమార్ తన కూతురు పెండ్లి వేడుక నిర్వహించారు. డిసెంబర్ 17 నుంచి 21 మధ్య జరిగిన ఈ వేడుకకు ఈవెంట్లు, డిన్నర్లు, హోటల్ రూముల ఏర్పాట్లను మేఘా కంపెనీ ప్రతినిధులే చూసుకున్నారని, ఈవెంట్లను బుక్ చేసినట్లు ఈ మెయిల్, ఇన్ వాయిస్ డేటాను ‘ది న్యూస్ మినిట్’ ఆధారాలతో ప్రచురించింది.
తాజ్ హోటల్ గ్రూపుకు బిగ్ వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బిల్లులు చెల్లించిందని, ఇదో మిస్టరీ కంపెనీ అని అనుమానాలు వ్యక్తం చేసింది. మేఘాకు చెందిన వివిధ సంస్థల డైరెక్టర్లే ఇందులో ఉన్నారని, అందుకే ఈ పెండ్లి ఏర్పాట్లు, బిల్లులతో మేఘా కంపెనీకి సంబంధం ఉందని బయటపెట్టింది.
స్వయంగా రజత్ కుమార్, ఆయన ఓఎస్డీ ప్రభాకరరావు, ఇద్దరు మేఘా ప్రతినిధులతో కలిసి ఇదంతా కో ఆర్డినేట్ చేసినట్లు తెలిపింది. పెండ్లికి ఐదు నెలల ముందే హోటళ్లలో రూమ్స్‌ను బుక్ చేశారని, నిరుడు జూలై 31న బుకింగ్స్కోసం హోటళ్లకు మెయిల్స్ వెళ్లాయని, అంతకు ఒక్క నెల ముందు (జూలై 1న) బిగ్ వేవ్ ఇన్ఫ్రా కంపెనీని ఏర్పాటు చేశారని ‘ది న్యూస్ మినిట్’ వివరించింది.
కంపెనీ అడ్రస్‌ను పట్టుకొని తాము వెతకగా.. అక్కడ ఎలాంటి కంపెనీ లేనట్లు తేలిందని పేర్కొంది. డిసెంబర్ 20న తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో 70 మంది అతిథులకు రజత్ కుమార్ ఖరీదైన విందు ఇచ్చారు. ఒక్కో ప్లేట్ కు రూ. 16,520 చొప్పున బిల్లింగ్ అయిందని స్టోరీలో ‘ది న్యూస్ మినిట్’ పేర్కొంది.
ఎప్పుడు ఏం జరిగింది.. ఎవరెవరి మధ్య లావాదేవీలు జరిగాయి.. వంటి పలు విషయాలను ప్రస్తావించింది. అయితే.. వీటిలో నిజాలు లేవని, తన కూతురి పెండ్లి ఏర్పాట్లు తానే స్వయంగా చేసుకున్నానని వెబ్‌సైట్‌కు రజత్ కుమార్ వివరణ ఇచ్చారు.
తమ కంపెనీకి, ఆ పెండ్లికి సంబంధం లేదని, వ్యక్తులుగా ఎవరైనా సహకరిస్తే అది తమ కంపెనీకి అంటగట్టడం సరైంది కాదని తమ స్టోరీ పబ్లిష్ అయిన వెంటనే మేఘా కంపెనీ వివరణ ఇచ్చిందని ‘ది న్యూస్ మినిట్’ పేర్కొంది. స్టోరీ పబ్లిషింగ్కు ముందు వివరణ అడిగితే కంపెనీ ఇవ్వలేదని, పబ్లిష్ అయిన తర్వాత వివరణ ఇచ్చినట్లు తెలిపింది.