దాదాపు ప్రతి 150 మందిలో ఒకరు అంటే ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల మంది ప్రజలు ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) అంచనా వేసింది. వీరు బలవంతంగా పనిలోకి లేదా బలవంతపు వివాహ బంధంలోకి అడుగిడుతున్నారని తెలిపింది.
ఇటీవలి సంవత్సరాల్లో వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రూపాల్లోని ఆధునిక బానిసత్వాన్ని 2030 కల్లా తుడిచిపెట్టాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకుంది. 2016-2021 మధ్య కాలంలో ఇలా బలవంతపు పని లేదా బలవంతపు వివాహంలోకి అడుగిడేవారి సంఖ్య ఏకంగా కోటి పెరిగిందని ఐక్యరాజ్య సమితి సంస్థలు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
ఐక్యరాజ్య సమితి కార్మిక, మైగ్రేషన్ సంస్థలు వాక్ ఫ్రీ ఫౌండేషన్‌తో కలిసి ఈ సర్వే నిర్వహించాయి. గత ఏడాది చివరిలో 2.8కోట్ల మంది కట్టు బానిసలుగా మారగా, 2.2 కోట్ల మంది బలవంతపు వివాహ బంధంలోకి అడుగిడారని వెల్లడైంది. 2017లో ప్రచురించిన నివేదికతో పోల్చితే 10మిలియన్ ప్రజలు ఆధునిక బానిసత్వంలో గడుపుతున్నారని ఐఎల్ఒ వెల్లడించింది.
ఈ రీతిన మానవ హక్కుల దాడి కొనసాగడం ఎంత మాత్రమూ సమర్ధనీయం కాదని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) అధినేత గై రైడర్ స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారత్‌తోపాటు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, కాంగో, ఉగండా, యెమెన్లలో బాల్య, బలవంతపు వివాహాలు ఎక్కువయ్యాయని ఐఎల్ఒ గుర్తించింది.
అయితే సమస్య పరిష్కరించడానికి ఆయా దేశాలు ఎటువంటి సత్వర చర్యలు తీసుకోవడం లేదని నివేదికలో పేర్కొంది.
అసలే అంతంత మాత్రంగా వును పరిస్థితులను కరోనా మహమ్మారి చిన్నాభిన్నం చేసిందని, దీంతో చాలామంది కార్మికుల రుణాలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోయాయని, దీంతో ముప్పు బాగా పెరిగిందని ఆ నివేదిక పేర్కొంది.
వాతావరణ మార్పులు, సాయుధ ఘర్షణలు కూడా దీనికి తోడవడంతో ఉపాధికి, చదువుకి కనివినీ ఎరుగనిరీతిలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కుటుంబాలకు కుటుంబాలు దుర్భర దారిద్య్రంలో మగ్గిపోయాయి. దీంతో సురక్షితం కాకపోయినా బలవంతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం ఆరంభించారని, దీని వల్ల ముప్పు మరింత పెరిగిందని ఆ నివేదిక పేర్కొంది.
సురక్షితం కాని వలసలు, లింగవివక్షతో కూడిన హింస గత కొన్నేళ్లుగా పలు రూపాల్లో బానిసత్వం పెరగడానికి కారణమవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన పసిఫిక్ ప్రాంతంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు బలవంతపు వివాహపు బాధితులున్నారు.
అరబ్ దేశాల్లో ప్రతి వెయ్యిమందిలో ఐదుగురు బాధితులుగా నమోదవుతున్నారు. పితృస్వామ్యం, ఆచారాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో బలవంతపు వివాహాల సంఖ్య ఎక్కువగా ఉందని ఐఎల్ఒ తెలిపింది. 85శాతం కుటుంబ ఒత్తిడితోనే ఇవి జరుగుతున్నాయని ఐఎల్ఓ నివేదించింది.
ఇదొక సుదీర్ఘకాల సమస్యగా మారిపోయిందని, బలవంతంగా పనిచేయించుకోవడమంటే కొనేుళ్లు పడుతుందని, ఇక బలవంతంగా వివాహమంటే అది యావజ్జీవితం అనుభవించాల్సిందేనని నివేదిక హెచ్చరించింది.
దీనివల్ల ఇబ్బందుల పాలయ్యేది మహిళలు, పిల్లలేనని పేర్కొంది. ప్రతి ఐదుగురిలో ఒకరు ఇలా బలవంతంగా పనిలోకి దిగుతుంటే, అందులో సగం మంది లైంగిక వేధింపులకు గురవుతున్నారని నివేదిక హెచ్చరించింది. వలస వచ్చిన వారిలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉందని పేర్కొంది.