వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకపోతే కరెంట్ కట్ చేసేలా కేంద్రం విద్యుత్ బిల్లును రూపొందించిందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్కడివో పాత పేపర్లను, చిత్తు కాగితాలను పట్టుకుని పవిత్రమైన అసెంబ్లీని కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు.
ప్రజా సంగ్రామ యాత్ర నాల్గవ దశను సోమవారం ప్రారంభిస్తూ అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిందంతా అబద్దమని నిరూపించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. ‘‘కేసీఆర్… ఇదిగో కేంద్ర విద్యుత్ బిల్లు… నీకు పంపిస్తున్నా. చదువుకో… నీకే గనక సిగ్గు, లజ్జ ఉంటే తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయ్. పవిత్రమైన అసెంబ్లీనే తప్పుదోవ పట్టించిన నువ్వు వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే. ఒకవేళ నేను చెప్పేది తప్పయితే రాజీనామాకు సిద్ధం’’అని సవాల్ విసిరారు.
బీజేపీ పేరుతో మోటార్లకు మీటర్లు పెట్టేందుకు, కరెంట్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై మరో రూ.4 వేల కోట్ల భారం మోపేందుకు కేసీఆర్ కుట్రకు తెరదీశారని ఆరోపించానారు. బీజేపీ పేరుతో మోటార్లకు మీటర్లు పెడితే ప్రగతి భవన్ గడీలు బద్దలు కొట్టి తీరుతామని సంజయ్ హెచ్చరించారు. ఆర్టీసీ విషయంలోనూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. 99 ఏళ్ల లీజు పేరుతో విలువైన ఆర్టీసీ డిపోలు, ఆర్టీసీ స్థలాలను కేసీఆర్ కుటుంబం, వారి చెంచాగాళ్లకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం చేయనీయబోమని స్పష్టం చేశారు. బీజేపీ చేపట్టిన 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కుత్బుల్లాపూర్ లోని రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వేలాది మందిని ఉద్దేశించి సంజయ్ ప్రసంగించారు.
హైదరాబాద్ ను డల్లాస్, లండన్, సింగపూర్, న్యూయార్క్ చేస్తానన్నవ్… ఏమైంది? హైదరాబాద్ లో గుంత కన్పిస్తే వెయ్యి రూపాయలిస్తానంటివి…. నేను వస్తున్న దారంతా గుంతల మయమే. ఆ గుంతలకు డబ్బులియ్యాలంటే.. నీ బడ్జెట్ కూడా సరిపోనట్లుందని అంటూ ఎద్దేవా చేశారు.
కేంద్ర నిధులతో ఫ్లైఓవర్, కేబుల్ బ్రిడ్జీలు కట్టి అదే అభివ్రుద్ధి అంటున్నడు.. డ్రైనేజీ సరిగా లేదు..చినుకు పడితే హైదరాబాద్ మునిగిపోయే దుస్థితి. నాలాల్లో పడి చనిపోతున్నరు. పట్టించుకోవడం లేదు. నాలాలు, చెరువులను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నరు. దీనిని ప్రశ్నించడానికే పాదయాత్ర చేస్తున్నాఅని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని కుత్భుల్లాపూర్ ప్రజలు సంజయ్‌కి బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర పొడువునా జనం నీరాజనం పలికారు. తొలిరోజు చిత్తారమ్మ ఆలయం వద్ద అమ్మవారి ఆశీస్సులు తీసుకుని రాంలీలా మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఇక.. రాత్రి పొద్దుపోయే దాకా నడక కొనసాగించారు. మొత్తం 7 కిలోమీటర్లు మాత్రమే నడిచినప్పటికీ… దారి పొడవునా జనం ఎదురేగి ఘన స్వాగతం పలికారు.
మహిళలు సంజయ్ ను కలిసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. ఇండ్లు లేవని కొందరు, రేషన్ కార్డుల్లేవని మరికొందరు.. ఉపాధి లేదని ఇంకొందరు.. డ్రైనేజీ, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో కాలుష్యంతో అల్లాడిపోతున్నామని.. ఇలా పెద్ద ఎత్తున బండి సంజయ్ ను కలిసి సమస్యలను విన్నవిస్తూ వినతి పత్రాలు అందజేశారు. అందరి బాధలు వింటూ… బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ సంజయ్ రాత్రి బసవైపుగా ముందుకు సాగారు.