పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాబన్న చలో.. సచివాలయ ముట్టడి పేరుతో బీజేపీ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తకు దారితీసాయి. దీంతో పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు కోల్కతా, హౌరా రైల్వే స్టేషన్లకు వెళ్లారు. అక్కడ వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి నిలువరించారు. దీం
తో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు పోలీసులతో బాహాబాహీకి దిగారు. దీంతో రాణిగంజ్ రైల్వే స్టేషన్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య ఘర్షణ తలెత్తింది. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ఉపపయోగించారు.
దీంతో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో రాణిగంజ్ రైల్వే స్టేషన్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దుర్గాపూర్ రైల్వే స్టేషన్ లో 20 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారని బీజేపీ నేత అభిజిత్ దత్తా ఆరోపించారు.
బీజేపీ నేతలు పోలీసుల తీరుని తప్పుబట్టారు. శాంతియుత నిరసనకు అనుమతించి శాంతిభద్రతలు కాపాడేల్సిన పోలీసులే హింస చెలరేగేలా చేస్తున్నారని మండిపడ్డారు. బెంగాల్ ప్రతిపక్ష నేత, మాజీ టీఎంసీ నాయకుడు సువేందు అధికారి కూడా మమత ప్రభుత్వంపై మండిపడ్డారు.
బెంగాల్ ను ఉత్తర కొరియాలా మార్చారని విమర్శించారు. మరోవైపు టీఎంసీ నేతలు పోలీసుల చర్యను సమర్థించారు. అసలు బీజేపీ ఎందుకు ఆందోళనలు చేస్తుందని ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై నిరసన చేపట్టాలని సూచించారు.
ఆందోళనలో పాల్గొనడానికి వస్తున్న సువెందు అధికారి, బీజేపీ ఎంపీ లాకెట్ చట్టర్జి తదితరులను మధ్యలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని సువేందు ఆరోపించారు.
