తెలంగాణ అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే మంగళవారం రచ్చ చోటు చేసుకుంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరమనిషి అన్నారని, స్పీకర్ కు ఆయన క్షమాపణ చెప్పాలని టిఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. అయితే క్షమాపణ చెప్పేందుకు నిరాకరించడంతో ఈటల రాజేందర్‌పై సస్పెండ్ వేటు పడింది.
ఈ సందర్భంగా శాసనసభలో టిఆర్ఎస్ సభ్యులు, ఈటల రాజేందర్ మధ్య వాగ్వాదం జరిగింది. సభాగౌరవాన్ని పాటించకుండా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున సభ నుంచి ఈటలను సస్పెండ్ చేయాలంటూ టిఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్‌ను ‘మర మనిషి’ అంటూ ఈటల సంబోధించారని, సభకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోరారు.
సభలో కొనసాగే అర్హత ఆయనకు లేదని మరో సభ్యుడు బాల్క సుమన్ స్పష్టం చేశారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈటల క్షమాపణలు చెప్పిన తరువాతే చర్చలో పాల్గొనాలని కోరారు. ఈటల అమర్యాదగా మాట్లాడారని.. సభలో చర్చ కంటే బయట రచ్చకే ఆయన మొగ్గు చూపుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఆ తర్వాత స్పీకర్ స్పందిస్తూ సభా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని, సభ మూడ్‌ను అర్థం చేసుకోవాలని ఈటలకు సూచించారు. మరోవైపు టిఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తుండటంతో ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ సభ్యుడిగా సభలో మాట్లాడే అవకాశం తనకు ఉందా ? లేదా ? బెదిరిస్తున్నారా ? ఏం చేస్తారు ? ‘ అంటూ నిప్పులు చెరిగారు.
ఈటల రాజేందర్ ను అకారణంగా శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డి కె అరుణ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ ఏమైనా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా? అని ఆమె నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యేలు అంటే అంత భయం ఎందుకు? ఎమ్మెల్యే ఈటలను ఏ కారణంతో సస్పెండ్ చేసి పోలీస్ వాహనంలో తరలించారు? అని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈటల క్షమాపణలు చెప్పకపోవడంతో … స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్ పోచారం స్పందిస్తూ … ఈటలను ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కిషన్ రెడ్డి, అరుణ ఆగ్రహం
శాసనసభ నియమాలకు విరుద్ధంగా మాట్లాడిన మీరు ఎవరినైనా శాసనసభలో సస్పెండ్ చేయాలి అంటే స్పీకర్ ముందుగా సస్పెండ్ చేయవలసింది సీఎం కేసీఆర్ ను అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మరమనిషి అనే ఒక సాధారణ పదాన్ని ఈటల వాడితే.. దాన్ని అన్ పార్లమెంటేరియన్ పదంగా పరిగణించడం సరికాదని హితవు చెప్పారు.
ఎన్నో అన్ పార్లమెంటేరియన్ పదాలను సీఎం కేసీఆర్ వాడితే అమృత పదాలుగా పరిగణిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్ నుంచో, బండి సంజయ్ నుంచో ఏవైనా పదాలు వస్తే మాత్రం అన్ పార్లమెంటేరియన్ గా ముద్రవేసే దుష్ట యత్నంలో కేసీఆర్ సర్కారు ఉన్నదంటూ ధ్వజమెత్తారు.
రాష్ట్ర శాసనసభలో ప్రధాన మంత్రి మోదీని `ఫాసిస్ట్’ అని మాట్లాడిన ముఖ్యమంత్రిపై స్పీకర్ ముందుగా చర్య తీసుకోవాలని హితవు చెప్పారు. కేవలం సస్పెండ్ చేయడమే కాకుండా, కేసీఆర్ శాసనసభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈటల రాజేందర్ ను అకారణంగా శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డి కె అరుణ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ ఏమైనా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా? అని ఆమె నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యేలు అంటే అంత భయం ఎందుకు? ఎమ్మెల్యే ఈటలను ఏ కారణంతో సస్పెండ్ చేసి పోలీస్ వాహనంలో తరలించారు? అని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.
రాజేందర్ సస్పెన్షన్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండిస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చని వాళ్లనే మర మనిషి అంటారనితెలిపా రు. హామీలను అమలు చేయలేని వాళ్లను మర మనిషి అనడం తప్పా అని ప్రశ్నించారు. అసెంబ్లీ బయట మరమనిషి అన్నందుకే అంత కోపం వస్తే అసెంబ్లీలో దేశ ప్రధానిని ఫాసిస్టు ప్రధాని అంటే మాకు కోపం రాదా అని ప్రశ్నించారు