సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనదినంగా అధికారికంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే ఖంగుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆ ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు ప్రకటించారు. తద్వారా అమిత్ షా సమక్షంలో హైదరాబాద్ లో కేంద్రం నిర్వహించి అధికారిక ఉత్సవాలకు గైరాజరు కావచ్చని పధకం వేశారు.
అయితే, ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో బిజెపి ప్రచారం చేసుకొనేందుకు అవకాశం లేకుండా చేయడం కోసం నగరంలోని మెట్రో పిల్లర్లు, ఆర్టీసీ బస్సులపై స్థలాన్ని ముందుగానే టిఆర్ఎస్ రిజర్వ్ చేసుకోంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యాడ్స్ మాత్రమే ప్రచారం చేసేలా యాడ్ ఏజెన్సీల ద్వారా ఏర్పాట్లు చేసింది.
దీంతో బీజేపీ ప్రచారానికి అవకాశం లేదంటూ యాడ్ ఏజెన్సీలు తిరస్కరించాయి. దీంతో టీఆర్ఎస్ తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాడ్స్ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమకు అవకాశం ఇవ్వకుండా పిల్లర్లు, ఆర్టీసీని టీఆర్ఎస్ బుక్ చేసుకుందని సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు.
‘‘తెలంగాణ విమోచన దినోత్సవం కోసం ఆర్టీసీ బస్సులు అడిగితే మాకు ఇవ్వమన్నారు. లెటర్ అడిగితే భయపడ్డారు. బస్ అద్దె 6 వేల నుంచి 18 వేలు పెంచారు. అసద్‌ను ఒప్పించి సీఎం కేసీఆరే సమైక్యతా దినోత్సవం లేఖ రాయించారు.’’ అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అమిత్ షా పాల్గొనే బహిరంగసభకు బస్సు లను సరఫరా చేసేందుకు కూడా ఆర్టీసీ విముఖత వ్యక్తం చేస్తున్నది.
‘‘కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ ఎందుకు రాడు?. మోదీ హయాంలో పైరవీలు లేకుండా పోయాయి. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలకు ఎందుకు కరోనా వచ్చిందో అర్థం కావడం లేదు. నేను వాళ్ళను కలవక చాలా రోజులు అయింది” అంటూ కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారంలో రాజ్ భవన్ వద్ద తాను కేసీఆర్‌ను కలిశానని చెబుతూ కేసీఆర్ కుటుంబంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆయన చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు సీట్లు అందుకే తగ్గాయి? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గట్టిగా కొట్లాడేవారుంటే ప్రజలు టీఆర్ఎస్కు ఓటేయ్యరని స్పష్టం అయినదని తెలిపారు. నాగార్జునసాగర్‌లో మాకు అభ్యర్థి సరిగా లేకనే ఓడిపోయామని చెప్పారు.
తెలంగాణ గ్రామాల్లో బీజేపీ లేకపోతే కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్‌లో ఎంపీ సీట్లు ఎలా గెలిచామని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కార్యకర్తలను కేంద్రమంత్రులను చేసే పార్టీ బిజెపి అంటూ టీఆర్ఎస్ను ఓడించేందుకు రాజకీయ వాతావరణం తెలంగాణాలో సృష్టించామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ ఓడిపోతుందని స్పష్టం చేశారు.