బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ని పది రోజుల్లో విడుదల చేయకపోతే హైదరాబాద్ ను ముట్టడిస్తామని అఖిల భారత శ్రీరామ్ సేన హెచ్చరించింది. రాజాసింగ్ అరెస్ట్ పై కర్ణాటకకు చెందిన అఖిల భారత శ్రీరామ్ సేన తీవ్రంగా స్పందించింది.
ఈ సంఘం జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ మూతాలిక్ మీడియాతో మాట్లాడుతూ రాజాసింగ్ ను కలవడానికి జైలుకు వెళ్తే అనుమతించకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజాసింగ్ ఏమైనా ఉగ్రవాదా? ఎందుకు కలవనివ్వడం లేదు? అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే పై అక్రమ పి డి యాక్ట్ నమోదు చేసి, అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజాసింగ్ కు జైలులో ఎలాంటి సౌకర్యాలు కల్పించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్ కు ఏమైనా జరిగితే కేసీఆరే బాధ్యత వహింపవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.
రాజాసింగ్ పై పెట్టిన కేసులు ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే లక్షలాది మందితో హైద్రాబాద్ ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. అందులో ఎలాంటి సంఘటనలు జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
“ఒక ముస్లిం మునవర్ ఫారూఖ్ అలీ హిందువు దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఎలా ఊరుకొంటాము? హిందూ దేవుళ్లను కించపరిచిన మునవర్ ఫారుకీ షోకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చింది? అని ప్రశ్నించారు. హైద్రాబాద్ లో ఆందోళనకు కారణం తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు.