గోవాలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది బీజేపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, సీఎల్పీ నేత మైఖేల్ లోబో, డెలిలా లోబో, రాజేష్ పల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సో సిక్వేరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ కమలం పార్టీలో చేరినవారిలో ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ లను బలోపేతం చేసేందుకే బీజేపీలో చేరామని మైఖేల్ లోబో తెలిపారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో బీజేపీకి 20 మంది, కాంగ్రెస్కు 11 మంది సభ్యులున్నారు.
2019 జులైలోనూ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. మూడింట రెండొంతుల మంది పార్టీని వీడితే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును తప్పించుకునే అవకాశం ఉంటుంది. గతంలో కూడా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే వార్తలు వచ్చినా..అధిష్టానం చర్యలతో అది సద్దుమణిగింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న తరుణంలో ఆ పార్టీలో ఈ పరిణామం జరగడం గమనార్హం.
గత ఎన్నికలలో 20 సీట్లు బిజెపి గెలుచుకోగా కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. బిజెపి తన మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.