కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ ‘ రేప్ ఎంజాయ్’ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. గురువారం రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్‌నుద్దేశించి ఆయన ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై జాతీయ మహిళ కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) చైర్పర్సన్ రేఖా శర్మ మండిపడ్డారు.
మహిళా ద్వేషి, మహిళల పట్ల విద్వేషపూరిత మనస్తత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండటం విచారకరమని ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ ఈ వ్యాఖ్యలు చాలా అసహ్యపూరితమైనవి. అసెంబ్లీలో కూర్చుని ఇలా మాట్లాడితే… నిజ జీవితంలో మహిళల పట్ల వీరు ఎలా ప్రవర్తిస్తారు?’ అంటూ నిలదీస్తూ ఆమె ట్వీట్ చేశారు.
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా గురువారం రాష్ట్రంలో ఇటీవల వరదలకు, వర్షాలకు పంట, ప్రాణ నష్టం కల్గిన రైతుల గురించి చర్చించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుబడ్డారు. దీనిపై స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే అనుమతించకపోవడంతో.. మాజీ స్పీకర్ రమేశ్ స్పందించారు.
‘అత్యాచారం అనివార్యమైనప్పుడు.. దాన్ని ఎంజాయ్ చేయాల్సిందే అని సామెత ఉంది. మీరిప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఎవ్వరూ ఖండించకపోగా.. స్పీకర్ సైతం పగలబడి నవ్వడం వీడియోలో కనిపిస్తోంది.
ఆ వాఖ్యలు చేసిన సభ్యుడిని మందలించి, వాటిని రికార్డుల నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించకుండా, విశ్వేశ్వర హెగ్డే నవ్వడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. మహిళా సంఘాలు ఈ వాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఈ రకమైన వ్యక్తులు ప్రజల అభివృద్ధి కోసం ఎలా పని చేస్తారో అర్థం కావడం లేదని రేఖ శర్మ వాపోయారు. ఒకవైపు వాళ్లే చట్టాలు చేస్తూ, మరోవైపు వాళ్లే రేప్‌లను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులకు పార్టీలు ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని, ఒక వేళ పార్టీలు ఇచ్చిన ప్రజలు ఓటు వేయకూడదని రేఖా శర్మ చెప్పారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్ కుమార్ వాఖ్యలపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా మండిపడ్డారు. ఇలా మాట్లాడటం సిగ్గుచేటని దయ్యబట్టారు. ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు.
మహిళల గౌరవాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేసిన చోటే, మహిళల విషయంలో కించపరిచే మాటలు మాట్లాడటం నిజంగా సిగ్గుచేటని ఆమె ఆక్షేపించారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే వెంటనే ఆయన్ను బర్తరఫ్ చేయాలని స్మృతి ఇరానీ సవాల్ విసిరారు.
‘‘అమ్మాయిని నేను, పోరాడగలను’’ అని ఉత్తర ప్రదేశ్‌లో నినదించడానికి ముందు రమేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము ఉందా? అంటూ ఆమె కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఎద్దేవా చేశారు.
కాగా, తాను చేసిన వ్యాఖ్యలపై రమేశ్ కుమార్ క్షమాపణలు తెలిపారు. అసెంబ్లీలో రేప్‌పై తాను చేసిన అసంబద్ధ, నిర్లక్ష పూరితమైన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని, క్షమించాలని ప్రజలను కోరారు. చాలా హేమయైన ఈ నేరం గురించి తాను నవ్వులాటగా మాట్లాడలేదని, అనాలోచితంగా చేశానని, అయితే ఇటువంటివి మరో సారి జరగకుండా చూస్తానని చెప్పారు.
రేప్‌లను తీవ్రమైన నేరాలు కాదని తేలికగా చేసి చెప్పడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. తాను పొరబాటుగా చేసి వ్యాఖ్యలు మాత్రమేనని చెప్పారు. ఇకపై తాను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వ్యవహరిస్తానని పేర్కొన్నారు.