‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ నిబంధనను రద్దుచేస్తూ భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు (బిసిసిఐ) చేసిన రాజ్యాంగ సవరణలను సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఆమోదించింది. దానితో బీసీసీఐ అధ్యక్షునిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శిగా జై షా మరో మూడేళ్లు కొనసాగే అవకాశం ఏర్పడింది.
రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ల పాలకమండలిలో కొనసాగుతున్నప్పటికీ బిసిసిఐలో వరుసగా రెండుసార్లు పదవుల్లో కొనసాగొచ్చని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. బిసిసిఐ రాజ్యాంగం ప్రకారం ఏ ఆఫీస్ బేరర్ అయినా రెండుసార్లు వరుస ఆ పదవుల్లో కొనసాగి ఆ తర్వాత తప్పనిసరి విరామం ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ తీసుకోవాల్సి ఉంది.
రాష్ట్ర సంఘంలోనైనా, బిసిసిఐలోనైనా లేదా రెండింటిలో వరుసగా రెండు దఫాలు (మూడేళ్ల చొప్పున) పదవుల్లో ఉన్న వాళ్లు అదే క్రమంలో మూడో పర్యాయం పదవుల్లో కొనసాగడానికి వీల్లేదు. మూడేళ్లు విరామం తీసుకుని మళ్లీ పోటీ చేయొచ్చు.
రాష్ట్రంలో ఒక పర్యాయం, ఆ వెంటనే బిసిసిఐలో ఓ పర్యాయం ఆఫీస్ బేరర్‌గా ఉంటే వరుసగా రెండు పర్యాయాలు పదవిలో ఉన్నట్లే లెక్క. ఇప్పటివరకు బిసిసిఐ ఆ నిబంధననే అమలు చేసింది. ఆ నిబంధనలను అమలు చేస్తే అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జే షా ఆ పదవుల్లో కొనసాగేందుకు వీల్లేదు.
ఈ క్రమంలో ‘కూలింగ్ ఆఫ్ పిరియడ్’ను రద్దుచేస్తూ 2019 డిసెంబరులో జరిగిన బిసిసిఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రతిపాదనలు చేశారు. దీంతో పాటు 70 ఏళ్ల వయోపరిమితిని కూడా బిసిసిఐ తెరమీదకు తీసుకొచ్చింది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు అనుమతి కోరుతూ 2020 ఏప్రిల్‌లో బిసిసిఐ పిటిషన్ దాఖలు చేసింది.
ఆ పిటిషన్‌పై మంగళవారం నుంచి కోర్టు విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. దీంతో బిసిసిఐ 2019లో అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన సౌరభ్ గంగూలీ, జే షా పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్‌తో ముగియాల్సి ఉంది.
సుప్రీంకోర్టు తీర్పు బిసిసిఐకి అనుకూలంగా రావడంతో వీరు మరో మూడేళ్లపాటు ఆయా పదవుల్లో కొనసాగనున్నారు. సౌరవ్ గంగూలీ బిసిసిఐ అధ్యక్షునిగా ఎన్నికవ్వడానికి ముందు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్, జేషా షా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌లో పనిచేశారు.