ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పెను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. రాజధాని కీవ్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో ప్యాసింజర్ వాహనం ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో జెలెన్స్కీ తీవ్రమైన గాయాలేమీ కాలేదని, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని జెలెన్స్కీ ప్రతినిధి సెర్హీ నైకిఫొరోవ్ తెలిపారు.
అయితే ఈ రోడ్ ప్రమాదం ఎప్పుడు జరిగిందనే విషయాన్ని ఆయన తెలియజేయలేదు. అధ్యక్షుడు జెలెన్స్కీ రాజధాని కీవ్‌లో తన కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్యాసింజర్ కారు వచ్చి ఆయన ప్రయాణిస్తున్న కారుతోపాటు కాన్వాయ్‌లోని మరో వాహనాన్ని ఢీకొట్టింది. అయితే జెలెన్స్కీకి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి.
అధ్యక్షుడితోపాటు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌కు వైద్యులు చికిత్స చేశారు. అనంతరం జెలెన్స్కీని అంబులెన్సులో తరలించామని తెలిపారు. జెలెన్స్కీని పరిశీలించిన వైద్యులు ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని చెప్పారని ఆయన వెల్లడించారు.
ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతారని తెలిపారు. హత్యాయత్నమా లేదా ప్రమాద వశాత్తు జరిగిందా అనే విషయం విచారణలో తేలుతుందని పేర్కొన్నారు. ఇజియం నగరాన్ని రష్యా దళాల నుంచి ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా ఇజియం నగరంలో ఆయన పర్యటించి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.