సెప్టెంబర్ 17 విముక్తా? విలీనమా? – 1స్వతంత్ర చరిత్రలో హైదరాబాద్ సంస్థానం విలీనం ఓ చారిత్రక ఘట్టం. దేశం మధ్యలో ఓ నిప్పుల కుంపటి వలే `విద్రోహ సామ్రాజ్యం’ నెలకొనేటట్లు చేసిన బ్రిటిష్ పాలకుల కుట్రలను సర్దార్ పటేల్ ధైర్యసాహసాలతో వమ్ము చేసి, `ఆపరేషన్ పోలో’ ద్వారా విర్రవీగిన నిజాంను దారిలోకి తెచ్చిన చారిత్రక ఘట్టం.
ఏది ఏమైతేనేం నాటి నిజాం ఏలుబడిలో గల తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిగా ఈ సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాదు నిజాం వారసులుగా భావించే మజ్లీస్ పార్టీ వారు కూడా సెప్టెంబర్ 17న అధికారిక కార్యక్రమాలను మొదటిసారిగా జరుపుతున్నారు.
ఈ సందర్భంగా ఈ రోజు నిజాం నిరంకుశ పాలన నుండి `విముక్తి పొందిన’ రోజుగా ప్రజానీకం భావిస్తుంటే, కొందరు రాజకీయ కారణాలతో కేవలం `విలీనం’ జరిగిన రోజు మాత్రమే అంటూ ఆ నాటి ప్రజల త్యాగాలను తక్కువచేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నిజాం? ఏమిటా పూర్వరంగం? కొన్ని ఆసక్తికర అంశాలను తెలుసుకుందాము.
స్వాతంత్ర్యం సిద్ధించడానికి పూర్వం భారతదేశంలో ఆంగ్లేయులు నేరుగా పాలించిన ప్రాంతాలే కాక, దాదాపు 500 పైచిలుకు సంస్థానాలు ఉండేవి. అన్నింటికంటే పెద్ద సంస్థానం హైదరాబాద్. దీని విస్తీర్ణం 82,698 చ.మై. అతి చిన్న సంస్థానము గుజరాత్ లోని “బిల్బరి.” అప్పటి నిజాం సంస్థానంలో 88% హిందువులు బానిసలే.
నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ 1911లో పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఈయనకు 42 మంది ఉంపుడుగత్తెలు, 7గురు భార్యలు, మొత్తం 149 మంది సంతానం. పెద్ద భార్య కొడుకు అజాం జా మీర్ హిమాయత్ అలీఖాన్. ఈయనకు 1931లో ఖలీఫా కూతురుతో పెళ్ళైంది. రెండో కొడుకు మీర్ షుజాత్ అలీఖాన్ కు ఖలీఫా దగ్గరి బంధువు కూతురుతో పెళ్ళి జరిగింది._
నిజాం తన రాజ్యాన్ని పూర్తి స్థాయి ముస్లిం రాజ్యంగా మార్చే ప్రక్రియ మొదలెట్టాడు. అందుకు ఆయన మొదట విద్యారంగాన్ని ఎంచుకొన్నాడు. హిందువులు స్వయంగా నడుపుకునే ఖాన్గీ బడులను నియంత్రించటం మొదలెట్టాడు. 4053 పాఠశాలల నుండి 776 కు తగ్గిపోయాయి. విద్యార్థుల సంఖ్య 76,654 మంది నుండి 27,506 కు తగ్గింది.
“సుల్తాన్-ఉల్-ఉలూమ్” అంటే విద్యలరాజుగా బిరుదు తగిలించుకొన్న ఈయన 1929లో నారాయణగూడాలో ఒక బాలికోన్నత పాఠశాల స్థాపిస్తే అది హిందువులదనే మిషతో అనుమతి నిరాకరించాడు. గత్యంతరం లేక నిర్వాహకులు కార్వే విశ్వవిద్యాలయం నుండి అనుమతి తెచ్చుకొన్నారు.1917లోనే తెలుగు మీడియం నిషేదించాడు.
1918లో అక్బర్ హైదరీ ప్రోద్భలంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించాడు. కానీ అందులో ఫాకల్టీ అఫ్ థియోలాజి అనే ముస్లిం మత విద్య ప్రవేశపెట్టారు. 1938లో వందేమాతర ఉద్యమాన్ని నిషేధించాడు.ఇస్లాం సిద్ధాంతం ప్రకారం అల్లా ఒక్కడే దేవుడు. సృష్టిని కాదు, సృష్టికర్తను ప్రార్దించాలనేది వారి విశ్వాసం. విగ్రహారాధన, ప్రకృతి ఆరాధన, వ్యక్తి పూజకు ఇస్లాం వ్యతిరేకం. కాని నిజాం ప్రభువు స్థుతింపుతోనే విద్యా సంస్థలు ప్రారంభమయ్యేవి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయలకు శుక్రవారం సెలవు ఉండేది. ముస్లిం పండుగలకు సెలవుండేది.
ఇక హిందువులు పండుగలు జరుపుకోవడం చాల కష్టతరమైనది. ప్రభుత్వోద్యాగాలు 90% పైచిలుకు ముస్లింలకే దక్కేవి. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంగ్లోపన్యాసాకులు అబ్దుల్ లతీఫ్ జనాభా మార్పిడి అనే సిద్ధాంతం ప్రతిపాదించాడు. దీని ప్రకారము హిందువులు హింసకు గురికాకుండా వుండాలంటే ఈ ప్రాంతాన్ని వదిలి పోవాలి. ఇక్కడ ముస్లిం జనాలతో నింపేయాలి.
హిందువులపై హింస… మతమార్పిడులు
ఈ సిద్ధాంతం ప్రభావము వల్ల 1948 వరకు 8 లక్షల ముస్లిం జనాభా వచ్చి చేరారంటే హిందువులు ఎంత హింసకు గురైనారో తెల్సుకోవచ్చు. అంజుమనే తబ్లిగ్ ఇస్లామ్ అనే సంస్థ మతమార్పిడులు చేసేది. దీనికి విరుగుడుగా ఆర్యసమాజం శుద్ధి ఉద్యమం ద్వారా మతం మారిన వారిని తిరిగి హిందూమతంలోకి పునరాగమనం చేయించేవారు. ఆర్యసమాజం 1892లో సుల్తాన్ బజారులో ప్రారంభమైంది.
అంజుమనే తబ్లిగ్ ఇస్లాం పీసర వీరన్న అనే దళితున్ని సర్దార్ అలీ గాను, దొడ్డి కొమురయ్య సొంత అన్న దొడ్డి మల్లయ్య ను ఖాదర్ అలీ గా మార్చింది. నిజాం తాను సెక్యులర్ అనిపించుకోవాలని ఆర్య సమాజం, అంజుమనే తబ్లిగ్ ఇస్లాం సంస్థలను నిషేధించాడు. కానీ మరోవైపు 1920లో బహాదూర్ యార్ జంగ్ ఆధ్వర్యంలో మజ్లీస్ ఇత్తే హాదూల్ (ఎంఐఎం) ముస్లిం అనే సంస్థ నిజాం ఆశీస్సులతో ప్రారంభం అయ్యింది.
ఎంఐఎం మొదట ఒక సాంస్కృతిక సంస్థగా ప్రారంభమయ్యింది. కాని అనతి కాలంలోనే పూర్తి మతోన్మాద సంస్థగా అవతరించింది. బహాదూర్ యార్ జంగ్ ఆకస్మిక మరణం తరువాత అబుల్ హసన్, తర్వాత మజహర్ అలీ కమాల్, తదుపరి ఖాసీం రజ్వీ, ఆ తరువాత సలావుద్దిన్ ఒవైసి, అసదుద్దిన్ ఒవైసి అధ్యక్షులయ్యారు. దాని లక్ష్యం మతమార్పిడులు మాత్రమే కాదు. ఇతర ప్రాంతాలనుండి పెద్ద మొత్తంలో ముస్లింలను దిగుమతి చేయటం.
ఎంఐఎం హిందువులపై చేసిన దురాగతాలు చరిత్రలో మాయని మచ్చలని ప్రముఖ తెలంగాణా పోరాట యోధుడు రఘువీర్ నారాయన్ లక్ష్మికాంత్ శ్రీనివాస్ రామ్ రాజా కాళోజి ” పేర్కొన్నాడు. నిజాం పాలనలో వ్యక్తి స్వేచ్ఛ, భావప్రకటన అనేదే లేదు. తెలుగులో ఒక పత్రిక స్థాపించడానికి నానా యాతన పడాల్సి వచ్చింది.
చివరకు “గోల్కొండ ” అనే పేరు పెడితే గాని అనుమతి లభించలేదు.కాళోజి నారాయణరావు, పెండ్యాల రాఘవరావు, మరికొందరు ఆర్యసమాజం సభ్యులు వరంగల్ తాలూకా పల్లగుట్ట, రాజారాం గ్రామాలలో పర్యటించి, ఎంఐఎం చేత బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డ దళితులను తిరిగి “శుద్ధి ” కార్యక్రమం ద్వారా హిందూ ధర్మంలో పునరాగమనం చేయించారు.