అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఫోర్బ్స్ ప్రపంచ శ్రీమంతుల జాబితాలో రెండోస్థానాన్ని ఆక్రమించారు. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్‌ను, ఫ్రాన్స్ లగ్జరీ రిటైల్ కింగ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అదానీ అధిగమించారు. అయితే శుక్రవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభంలో అదానీ గ్రూప్ షేర్లు పెరగడంతో కేవలం రెండు గంటలపాటే ద్వితీయస్థానంలో ఉన్న అదానీ ముగింపులో తిరిగి మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు.
అదానీ గ్రూప్‌లో లిస్టయిన ఏడు కంపెనీల షేర్లతో పాటు ఆ గ్రూప్ టేకోవర్ చేసిన సిమెంటు సంస్థలు ఏసీసీ, అంబూజా సిమెంట్స్ సైతం 1-5 శాతం మధ్య నష్టాలతో ముగిసాయి. ఈ క్రమంలో ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం తొలుత 155.7 బిలియన్ డాలర్లకు చేరిన గౌతమ్ అదానీ సంపద తదుపరి 152.6 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. బెర్నార్డ్ ఆర్నాల్ట్ 153.5 బిలియన్ డాలర్ల సంపదతో రెండోస్థానానికి వచ్చారు.
పారిస్‌లో లిస్టయిన బెర్నార్డ్ సంస్థ ఎల్వీఎంహెచ్ స్థిరంగా ట్రేడ్‌కావడంతో అదానీని మించారు. 149.7 బిలియన్ డాలర్ల సంపదతో బెజోస్ నాల్గో స్థానానికి తగ్గారు. అదానీ గ్రూప్ షేర్ల మార్కెట్ విలువ గురువారం రూ.20.11 లక్షల కోట్ల రికార్డుస్థాయికి చేరింది. ఈ క్యాలండర్ సంవత్సరంలో అదానీ సంపద 72.4 బిలియన్ డాలర్ల మేర పెరిగింది.
కాగా, ఫోర్బ్స్ జాబితాలో ముకేశ్ అంబానీ 91.6 బిలియన్ డాలర్ల సంపదతో 8వ స్థానంలో ఉన్నారు. ఇక టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ 273 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.