కేంద్ర హోంమంత్రి అమిత్ షా శామీర్ పేటలో ఉన్న మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసానికి వచ్చారు. ఇటీవల ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య కన్నుమూసిన విషయం తెలిసి విచారం వ్యక్తం చేస్తూ, ఈటల కుటుంబ సభ్యులను అమిత్ షా పరామర్శించారు.
ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు ఈటల నివాసానికి వచ్చారు.
ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లి 25 నిమిషాల పాటు గడిపారు. సుమారు 15 నిమిషాలపాటు అమిత్ షా.. ఈటలతో ఏకాంతంగా చర్చలు జరిపారు. తెలంగాణలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు.. మునుగోడు, పార్టీ బలోపేతం, తీసుకోవాల్సిన నిర్ణయాలపై అమిత్షా ఆరా తీసినట్లు తెలుస్తోంది.
అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో దివ్యాంగులకు అవసరమైన పరికరాలను అమిత్ షా పంపిణీ చేశారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని అమిత్ షా తెలిపారు.
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అందరికీ విద్యుత్, ఉచిత సిలిండర్లు, టాయిలెట్ల నిర్మాణాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి దివ్యాంగులకు అవసరమైన పరికరాలను అమిత్ షా పంపిణీ చేశారు.