మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారని, తనను కూడా చంపాలని చూస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణ చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో పాదయాత్ర చేస్తున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను వైఎస్ఆర్ బిడ్డనని, భయం లేదని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని హితవు చెప్పారు.
ఓ మహిళను ఎదుర్కోలేక స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని పేర్కొంటూ తాను పులి బిడ్డను అని, తనకు భయం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ బేడీలు తనను ఆపలేవని ఆమె ప్రెస్ మీట్ లో బేడీలు చూపించారు. తనను ఆపడం ఎవరి తరం కాదని అంటూ “మీకు పోలీసులుంటే.. నాతో జనం ఉన్నారు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి” అంటూ ఆమె సవాల్ చేశారు.అన్నారు. కేసులు పెట్టారు కదా… అరెస్ట్ చేయండి చూద్దామని ఎద్దేవా చేశారు.
తాను బ్రతికినంత కాలం ప్రజల కోసం పోరాటం చేస్తానని చెబుతూ తనను ఎదుర్కోలేని దద్దమ్మలు పోలీస్ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తనను అవమానిస్తే వైఎస్సార్ బిడ్డగా తాను కేసు పెట్టినా పోలీసులు స్పందించలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కేసు పెట్టేందుకు ఏకమైన పాలమూరు ఎమ్మెల్యేలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి ఏకమై ఉంటే బాగుండేదని హితవు చెప్పారు.
అవినీతిపై మాట్లాడితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు అంత భయమెందుకని షర్మిల ప్రశ్నించారు. తన పాదయాత్రను ఆపేందుకు ఎమ్మెల్యేలు కుట్రలు చేస్తున్నారని మండిపడుతూ తెలంగాణలో తాలిబన్ల రాజ్యం నడుస్తోందని ఆమె ధ్వజమెత్తారు.
‘‘ఒకడు మరదలు అంటాడు.. ఒకడేమో వ్రతాలు అంటాడు.. ఓ మంత్రి వ్యాఖ్యలపై నేను మాటలతోనే ఆగాను.. చేతలకు వెళ్లలేదు.. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినవారిని అరెస్ట్ చేస్తున్నారు..పోలీస్ శాఖను టీఆర్ఎస్లో విలీనం చేయండి.. ఆర్ఎస్ఎస్లా టీఆర్ఎస్కు ఒక సైన్యంలా పనిచేయండి.’’ అంటూ షర్మిల ఘాటుగా స్పందించారు.