ఓ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్ వైసీపీకి 47-67 స్థానాలు వచ్చే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మరోవంక, ప్రజలలో జనసేన పట్ల ఆదరణ పెరుగుతోందని అదే సర్వేలో తేలిందని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై వైసీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని పేర్కొంటూ గతంలో అమరావతి రాజధానికి మద్దతిచ్చి.. ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారని ధ్వజమెత్తారు. సభలో ఇచ్చిన మాటకు విలువ లేకుండా చేస్తున్నారని పేర్కొంటూ చట్టసభల్లో చేసిన చట్టానికి విలువ లేనప్పుడు వైసీపీకి పాలించే హక్కు లేదని స్పష్టం చేశారు.
ఏపీకి నేడు రాజధాని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ వేల ఎకరాలు వద్దు, చిన్న రాజధాని చాలని ఆ నాడు మిత్రపక్షంగా తెలుగు దేశం ప్రభుత్వంకు తాను చెప్పానని గుర్తు చేశారు. అయితే, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి 30 వేల ఎకరాలు అవసరం అన్నారని, ఇక్కడే ఇల్లు కట్టానని.. అమరావతిని అభివృద్ధి చేస్తానని అన్నారని తెలిపారు. తీరా ఓట్లు వేయించుకున్నాక మాట తప్పి మోసం చేశారని మండిపడ్డారు.
జనసేన ఎమ్మెల్యేలు పది మంది ఉంటే గట్టిగా పోరాడే వాళ్లమని చెబుతూ హామీలు నెరవేర్చని వారికి చట్టాలు చేసే అధికారం ఎక్కడిదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సమస్యలపై ప్రశ్నించేందుకు వేదిక కావాలనిపించిందని, ప్రశ్నించేందుకు, సేవ చేసేందుకే తాను పార్టీ స్థాపించినట్లు వివరించారు.
గెలిచే వరకు మళ్లీ మళ్లీ దెబ్బలు తినడానికి సిద్ధమని స్పష్టం చేశారు. తన జీవితంలో చేసిన మంచి పని పార్టీ పెట్టడమని పేర్కొంటూ 2019లో ప్రజలు ఏ ఉద్దేశంతో వైసీపీకి ఓటు వేశారో గానీ.. దాని పర్యావసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.
ఈ సారి జనసేన జెండా ఎగరాలి
ఈసారి అసెంబ్లీలో జనసేన జెండా ఎగరాలని చెబుతూ జనసైనికులు పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జనసేనకు బలమైన స్థానాలను గుర్తించి అక్కడ బాగా పని చేయాలని సూచించారు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగే అభ్యర్థులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్లో చేపట్టే జనసేన యాత్ర వాయిదా వేస్తున్నట్లు ప్రకతీటిస్తూ జనసేనాని పార్టీ బలోపేతంపై అధ్యయనం పూర్తయ్యాక యాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు.
త్వరలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తామని చెబుతూ 2019 ఓటమి తరువాత పార్టీ వదిలేసి పారిపోతానని చాలామంది ఆశించారని, అయితే వారి కోరిక నేరవేరకుండా చేశానని పేర్కొన్నారు. ‘‘నా దేశాన్ని, నా నేలను, నా పార్టీని వదిలే ప్రసక్తే లేదు’’ అని స్పష్టం చేశారు.