త్రివిధ దళపతి బిపిన్ రావత్ మృతికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై ఏ చిన్న ఆధారాన్ని కూడా వదలదలుచుకోలేదని, ఘటనా స్థలంలో దొరికిన ప్రతి సాక్ష్యాన్ని పరిశీలిస్తున్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్‌రామ్ స్పష్టం చేశారు. దుండిగల్ ఎయిర్ పోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ కమిటీలో ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారన్నారని ఆయన గుర్తు చేశారు. వాతావరణ తప్పిదమా, మానవ తప్పిదమా లేక సాంకేతిక లోపమా అనేది విచారణ చేస్తున్నామని వివేక్‌రామ్ తెలిపారు.
ఎలాంటి ఆధారాలూ లేకుండా ప్రమాదంపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని పేర్కొన్నారు. ఆధారాలు సేకరించిన తర్వాతే ఏమైనా మాట్లాడగలమని చెప్పారు. ప్రతి సాక్షిని విచారించాలని.. ఇందుకోసం వారాల సమయం పడుతుందని తెలిపారు.
కాగా, తూర్పు లడఖ్ ప్రాంతంలో ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశా రు. ప్రస్తుతం అక్కడ స్టేటస్ కో మేయింటేయిన్ చేస్తున్నామని వివేక్‌రామ్ పేర్కొన్నారు. సరిహద్దుల్లో బెదిరింపులు వస్తూనే ఉంటాయని… వాటికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
మల్టీ డైమన్షన్ వార్‌పై దృష్టి సారించాలని కాడెట్స్‌కు చెబుతున్నామని తెలిపారు. కేవలం యుద్ధం వైపే కాదు సాంకేతికంగా, సైబర్ పరంగా ఎదురయ్యే సవాళ్ళను ధీటుగా తిప్పికొట్టేలా నైపుణ్యం సాధించాలని చెబుతున్నామని పేర్కొన్నారు. డ్రోన్ దాడులు ఛాలెంజింగ్‌గా మారాయని చెబుతూ డ్రోన్ దాడుల నుంచి వీఐపీలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచే తాను ఈ స్థాయి వరకు వచ్చానని వివేక్‌రామ్ పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్ల నుంచి తొలి గౌరవ వందనాన్ని వివేక్ రామ్ చౌదరి స్వీకరిస్తూ ‘‘శిక్షణ పూర్తి చేసుకొని అధికారులుగా బాధ్యతలు చేపట్టబోతున్న మీ అందరికీ అభినందనలు. శిక్షణ కాలంలో ఎలాంటి స్ఫూర్తిని చూపించారో భవిష్యత్తులోనూ కొనసాగించాలి” అంటూ సూచించారు.
నిరంతర విద్యార్థిగా ఉంటేనే ఎంతో నేర్చుకోగలమని చెబుతూ విధి నిర్వాహణలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని, వాటన్నిటినీ ధీటుగా ఎదుర్కోవాలని దిశానిర్ధేశం చేశారు. పెరుగుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలని చెప్పారు.
“భారత వాయుసేన” భవిష్యత్తు మీరే అంటి స్పష్టం చేస్తూ రాజకీయాలు, అంతర్జాతీయ వ్యవహారాలు, సైనిక వ్యవస్థలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రొఫెషనలిజం, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండండి. కష్ట సమయాల్లోనూ ముందుకు వెళ్లే సామర్ధ్యం పెంచుకోవా’ అని పేర్కొన్నారు.