మరో మూడు రోజులలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల పక్రియ ప్రారంభించాల్సి ఉండగా, ఎన్నికపై కాంగ్రెస్ వర్గాల్లో అస్పష్టత కొనసాగుతున్నది. గాంధీ కుటుంభం వెలుపలి వ్యక్తిని అధ్యక్షునిగా ఎన్నికోవాలని అంటూ ఉన్నప్పటికీ గతంలో వలే తాను అధ్యక్ష పదవిని చేపట్టబోనని `భారత్ జోడో యాత్ర’లో ఉన్న రాహుల్ గాంధీ స్పష్టం చేయడం లేదు. అధ్యక్ష పదవిపై తగు సమయంలో స్పందిస్తానని మాత్రమే చెప్పారు.
మరోవంక ఒకొక్క ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాహుల్ పేరును సిఫార్సు చేస్తూ తీర్మానాలు చేస్తున్నాయి. రాహుల్ పోటీకి సిద్ధపడితే ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే రాహుల్ పోటీలో లేని పక్షంలో ఈ పోటీకి ఇప్పటికి ఇద్దరు ప్రముఖ నాయకులు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ పోటీకి సంసిద్ధత వ్యక్తం చేశారు. థరూర్ సోమవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలసి ఈ విషయమై ఆమెతో చర్చించారు కూడా. అయితే సోనియా కుటుంభంకు నమ్మకస్తుడిగా పేరున్న గెహ్లాట్ వైపే సోనియా, రాహుల్ మొగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గడిచిన 23 ఏళ్ల నుంచి పార్టీ అధ్యక్ష పదవి సోనియా లేదా రాహుల్ చేతుల్లోనే ఉంది. పార్టీలో వ్యవస్థీకృత మార్పులు జరగాలని సోనియాకు లేఖ రాసిన జీ23 నేతల్లో శశి థరూర్ కూడా ఒకరు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసిన గాంధీయేతర కుటుంబ చివరి వ్యక్తి సీతారామ్ కేసరి.కేసరి నుండి బలవంతంగా సోనియా బృందం అధ్యక్ష పదవిని 1999లో కైవసం చేసుకుంది.
పార్టీ అధ్యక్ష పదవికి పోటీకి రంగం సిద్ధం కావడం గురించి సీనియర్ నేత జైరామ్ రమేశ్ మాట్లాడుతూ, ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనమని తెలిపారు. పార్టీ టాప్ పొజిషన్ కోసం ఎవరైనా పోటీ చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.