గత టిడిపి ప్రభుత్వం విపక్ష సభ్యులపై నిఘా వేసేందుకు ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసి వినియోగించిందన్న ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. భూమన కరుణాకరెడ్డి చైర్మన్ గా ఈ పెగాసస్ సభా సంఘాన్ని స్పీకర్ అప్పట్లో ప్రకటించారు.
తాజాగా, భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ మధ్యంతర నివేదికను రూపొందించింది. ఈ నివేదికను మంగళవారం సభ ముందు ఉంచారు. గత ప్రభుత్వం డేటా చోరీకి పాల్పడినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే, దీనిపై సేకరించాల్సిన సమాచారం చాలా ఉందని, అనేకమందిని విచారించాల్సి ఉందని భూమన చెప్పారు. ఇందుకు సంబంధించి లోతైన పరిశోధన చేస్తున్నామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వానికి ఓటు వేయని వారి సమాచారాన్ని సేకరించారని, ప్రభుత్వం వద్ద స్టేట్ డేటా సెంటర్ లో ఉండాల్సిన సమాచారాన్ని టిడిపికి సంబంధించిన సేవామిత్ర యాప్ ద్వారా పూర్తిగా చోరీ చేశారని భూమన ఆరోపించారు. తమకు ఓటు వేయని దాదాపు 30 లక్షల మందికి చెందిన ఓట్లను రద్దు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.
సేవామిత్ర యాప్ ను ఈ విధంగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఈ డేటా తస్కరణకు పాల్పడిన వారిని పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సమాచారం బయటకు వెళ్లింది కానీ, ఎవరికి వెళ్లిందో తేల్చక పోవడం గమనార్హం. ఐపీ అడ్రస్ వివరాల కోసం గూగుల్‌ను అడిగినా లాభం లేకపోయిందంటూ నివేదికలో సభా సంఘం స్పష్టం చేసింది. గుర్తు తెలియని ఐపీ అడ్రస్సుకు డేటా వెళ్లిందంటూ నివేదికలో తెలిపారు.
కాగా, ఈ నివేదికను తప్పుబడుతూ డేటా చౌర్యం జరిగిందని ప్రభుత్వం చెబుతోందని, ఏం డేటా పోయిందో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. కమిటీ నివేదికలో పెగాసెస్ జరిగిందా? లేదా? అనేదే లేదని గుర్తు చేశారు. పెగాసెస్ వాడినట్లు అనుమానం ఉందని నివేదికలో చెప్పలేకపోయారని అంటూ ప్రభుత్వం కొండను తవ్వి చీమను కూడా పట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వమే డేటా చౌర్యం చేస్తోందని ఆరోపిస్తూ వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, దమ్ముంటే ఈ కేసు విచారణ కూడా సుప్రీంకోర్టుకు ఇవ్వాలని కేశవ్ సవాల్ చేశారు.