2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత పేరుతో ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థిగా ఉండడం కోసమే బీహార్ లో బిజెపితో పొత్తు తెంచుకున్నట్లు భావిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీష్ కుమార్ ఇప్పటికే తనకు ప్రధాన మంత్రి పదవిపై ఆసక్తి లేదని తేల్చి చెప్పారు.
మరోవంక, ఉత్తర ప్రదేశ్ నుండి లోక్ సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు, పూల్పూర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారని వస్తున్న వార్తలను సహితం ఆయన తోసిపుచ్చారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు విపక్షాల ఐక్యతపైనే తాను దృష్టి కేంద్రీకరించానని, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పట్ల తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు.
యూపీలో ఏ స్ధానం నుంచి పోటీ చేసినా తాము మద్దతిస్తామని యూపీ మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ నితీష్ కుమార్‌కు ఆఫర్ చేసినట్టు ఊహాగానాలు సాగాయి. పూల్పూర్ నుంచి నితీష్ కుమార్ పోటీ చేయాలని ఆ నియోజకవర్గానికి చెందిన జేడీయూ శ్రేణులు నితీష్‌పై ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలుస్తున్నది.
పూల్పూర్ సహా మిర్జాపూర్, అంబేద్కర్ నగర్ నియోజకవర్గాల నుంచి ఎంపీ అభ్యర్ధిగా బరిలో నిలవాలని నితీష్ కుమార్‌కు ఎస్పీ ఆఫర్ చేసినట్టు జేడీయూ జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్ పేర్కొనడం ఈ ఊహాగానాలకు మరింత బలమిచ్చింది.
అత్యధిక పార్లమెంట్ స్ధానాలున్న యూపీలో పైచేయి సాధించడం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల గెలుపునకు కీలకం. ప్రధాని నియోజకవర్గం వారణాసికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూల్పూర్ నుంచి నితీష్ కుమార్‌ను పోటీ చేయిస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని విపక్షాలు భావిస్తున్నాయి.
యుపి నుంచి నితీష్ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగితే యూపీలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పరిణామాల్లో కీలక మలుపు చోటుచేసుకుంటుందని ఈ సందర్భంగా అంచనా వేస్తున్నారు. అయితే అటువంటి కథనాలను తిప్పికొడుతూ తాను కేవలం ప్రతిపక్షాల ఐక్యత పట్లనే దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం చేశారు.