ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాస్త వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ అయ్యింది. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ యూనివర్సిటీకి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైస్సార్ పేరు పెట్టింది జగన్ సర్కార్. బుధవారం మంత్రి రజనీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదింప చేశారు.
సభలో మంత్రి రజనీ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నవారికి ఎన్టీఆర్ పేరు గుర్తోస్తోందని, అధికారం ఉంటే ఓ లాగా అధికారం లేకపోతే మరోలా చెపుతారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ మీద జగన్ కు గౌరవం ఉందని స్పష్టం చేశారు. 8 మెడికల్ కాలేజీలను వైఎస్సార్ 11కు చేశారని, దానిని జగన్ 28 మెడికల్ కాలేజీలకు చేర్చారని ఆమె చెప్పుకొచ్చారు. అందుకే ఆ క్రెడిట్ మనం తీసుకోవాలనే .. వైస్సార్ పేరు పెట్టామని తెలిపారు. ఇలాంటి వంద యూనివర్సిటీలకు అయినా వైస్సార్ పేరు పెట్టాలని మంత్రి రజని పేర్కొన్నారు.
వైద్యరంగంలో సంస్కరణల కర్త వైఎస్ఆర్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యాన్ని పేదల హక్కుగా మార్చారని, వైఎస్ఆర్ గొప్ప మానవతావాది, మహా శిఖరం అని కొనియాడారు. ఒక్క మెడికల్ కాలేజీని కూడా కట్టని టీడీపీ వాళ్లకు కావాల్సిన పేరును బలవంతంగా పెట్టుకున్నారన్నాని ధ్వజమెత్తారు. ఇన్ని మెడికల్ కాలేజీలు కడుతున్నప్పుడు వైఎస్ఆర్ పేరు పెడితే తప్పేంటని ప్రశ్నించారు.
మరోపక్క ఎన్టీఆర్ హెల్త్ వర్సీటీ పేరు మార్పుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం నిర్ణయంపై ఎన్టీఆర్ అభిమానుల్లోనూ ఆగ్రహం పెల్లుబికింది. ఎన్టీఆర్ పేరును ఎలా తీసేస్తారంటూ ఆందోళనలు చేస్తున్నారు.
పేరు మార్చడం ఫై టీడీపీ నేతలు , కార్య కర్తలు , నందమూరి అభిమానులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. మరోపక్క బిజెపి నేతలతో పాటు పలువురు సీనియర్ నేతలు సైతం వైస్సార్సీపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ గొల్లపూడిలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు మాజీ మంత్రి దేవినేని ఉమ. అటు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మనస్తాపం చెందారు. అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు యార్లగడ్డ ప్రకటించారు.
బిజెపి అభ్యంతరం
ఎన్టీఆర్ పేరు తొలగించడమంటే.. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చడం ఏపీ ప్రభుత్వ అనైతిక, అనారోగ్య రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ మాజీ ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికు తన తండ్రిపై అంత ప్రేముంటే ఏదైనా కొత్త సంస్థను స్థాపించి దానికి ఆయన పేరు పెట్టుకుంటే ఎవరూ తప్పు పట్టరని చెప్పారు. ఇలాంటి చర్యలు రాబోయే రోజుల్లో అనేక అనర్ధాలకు దారి తీసే అవకాశం ఉందని అంటూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైస్సార్ పేరు పెట్టాలనుకోవడంపై టీడీపీతో సహా వివిధ పార్టీలు, సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. టీడీపీకి మద్దతుగా బీజేపీ సహా పలు విద్యార్ధి సంఘాలు సైతం ఆందోళనకు దిగాయి.