ఎంఐఎం కనుసన్నల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ. పీఎఫ్ఐతో టీఆర్ఎస్ కు సంబంధముందని, టీఆర్ఎస్ పెంచి పోషిస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.టిఆర్ఎస్ అండదండలతోనే తెలంగాణాలో ఈ సంస్థ తన ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరింప చేసుకోగలుగుతుందని ఆరోపించారు.
ప్రజా సంగ్రామం పాదయాత్ర ప్రారంభమై వంద రోజులు పూర్తయిన సందర్భంగా నాగోల్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ 2040 నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర చేసిందని తెలిపారు. ఎన్ఐఏ వచ్చి సోదాలు జరిపే వరకు పీఎఫ్ఐ గురించి కేసీఆర్ సర్కార్ కు సోయి లేదని సంజయ్ ద్వజమెత్తారు. ఎంఐఎం ఆగడాలను బీజేపీ మాత్రమే అడ్డుకుంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణలో బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించాలనే కుట్ర ఇటీవల బిహార్‌లో బయటపడిందని, ఇది పీఎఫ్ ఐ లాంటి సంస్థల పనేనని స్పష్టం చేస్తూ ఎంఐఎం కనుసన్నల్లో పీఎ్‌ఫఐ పని చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి లంచాలిస్తే తప్ప పనులు కాని పరిస్థితి ఉందని అంటూ ఏ స్కాం చూసినా కేసీఆర్ కుటుంబానిదే పాత్ర ఉందని స్పష్టం చేశారు. కొన్ని పీఎఫ్ఐ సంస్థలకు టీఆర్ఎస్ నేతలు నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. సీబీఐ, ఈడీ దాడులు చూసి కేసీఆర్ కుటుంబం క్వారంటైన్ పోతోందని ఎద్దేవా చేశారు.
ప్రజా సంగ్రామ యాత్ర నాల్గో విడత పాదయాత్ర 9వ రోజు బుధవారం కొనసాగింది. గురువారంతో నాల్గవ విడత పూర్తి కానుంది. ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ నుంచి కొత్తపేట, చైతన్యపురి డివిజన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. నాగోల్‌కు చేరుకున్న సంజయ్ కు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం చైతన్యపురి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాదయాత్రలో భాగంగా సంజయ్ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ అండగా ఉంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. ఆయనతో పాటు పలువురు నాయకులు, భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు యాత్రలో పాల్న్నారు. ప్రజా సంగ్రామం యాత్రలో భాగంగా దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు శ్రమించిన స్ఫూర్తి ప్రదాతలు, సమర యోధుల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు.