మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. గురువారం పులివెందులకు వచ్చిన సీబీఐ అధికారులు అక్కడి ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్‌లో డ్రైవర్ దస్తగిరి, ఆయన భార్య షబానాను ప్రశ్నిస్తున్నారు.
సీబీఐ అధికారులను బెదిరిస్తున్నందున విచారణ ఆలస్యమవుతున్నదని, అందుకుగాను కేసు విచారణను ఇతర రాష్ట్రంలోని కోర్టుకు బదిలీ చేయాలని వివేకానంద కుమార్తె డా. సునీత ఇటీవల సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి సీబీఐ అధికారులు పులివెందులకు వచ్చారు.
పులివెందులకు వచ్చిన సీబీఐ అధికారులు ఇప్పటకే అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరిని విచారించారు. గతంలో సీబీఐ, ప్రొద్దుటూరు మెజిస్ట్రేట్ ఎదుట కీలక సమాచారం దస్తగిరి వెల్లడించినట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే, ఆయన భార్య షబానాను కూడా అధికారులు ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరోసారి సీబీఐ అధికారులు పులివెందులకు వచ్చినట్లుగా తెలుస్తున్నది. గత మూడు రోజులుగా సీబీఐ అధికారులు కడపలోనే మకాం వేసి పలు అనుమానితులను విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వివేకా పీఏను కూడా విచారించినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తున్నది.
దస్తగిరి గత కొన్ని రోజులుగా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. దస్తగిరిపై దాడికి దిగిన కొందరు వైసీపీ నేతలు పీఎస్‌లో కేసు పెట్టిన సందర్భంగా ఉన్నాయి. జిల్లా ఎస్పీ, సీబీఐ అధికారులను కలిసి తనను బెదిరిస్తున్న విషయాన్ని చేరవేశారు. ఎవరెవరు బెదిరించారనే కీలక సమాచారాన్ని ఫోన్ నంబర్లు సహా దస్తగిరి నుంచి సేకరిస్తున్నట్లు తెలుస్తున్నది.
వైఎస్ వివేకాను హత్య చేస్తే రూ.40 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి చెప్పినట్లు ఎర్ర గంగిరెడ్డి వెల్లడించిన అంశాలను ప్రొద్దుటూరు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన దస్తగిరికి వివిధ వర్గాల నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి.