పర్యావరణానికి హాని చేస్తుందని దుష్ప్రచారం చేస్తూ గుజరాత్లో నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని రాజకీయ అండ గల ”అర్బన్ నక్సల్స్, ప్రగతి నిరోధక శక్తులు” అనేక సంవత్సరాల పాటు అడ్డుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అటువంటి అర్బన్ నక్సల్స్ ఇప్పటికీ చురుకుగా ఉన్నారని, పర్యావరణ పరిరక్షణ పేరుతో వివిధ సంస్థల మద్దతుతో అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ప్రధాని హెచ్చరించారు.
గుజరాత్‌కు చెందిన నర్మదా జిల్లాలోని ఏక్తా నగర్ వద్ద రెండు రోజులపాటు జరుగుతున్న జాతీయ పర్యావరణ మంత్రుల సమావేశాన్ని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంబహిస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదా ఈజ్ ఆఫ్ లైఫ్ తీసుకురావాలన్న లక్షంతో చేపట్టిన ప్రాజెక్టులు అనవసర కారణాలతో ఆగిపోకుండా చూడాలని ఆయన వివిధ రాష్ట్రాలక పర్యావరణ మంత్రులకు విజ్ఞప్తి చేశారు.
అటువంటి శక్తుల కుట్రలను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ అనుమతులు మంజూరు చేయడంలో సమతుల విధానాన్ని అనుసరించాలని ప్రధాని కోరారు. సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని నిలిపివేయడం వల్ల ఏర్పడిన జాప్యానికి భారీ మొత్తంలో ప్రజాధనం వృథా అయిందని చెబుతూ డ్యాం నిర్మాణం ఇప్పుడు పూర్తి కావడంతో అర్బన్ నక్సల్స్, ప్రగతి నిరోధక శక్తుల ప్రచారం ఎంత బూటకమైనదో తేలిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
పర్యావరణానికి ఈ ప్రాజెక్టు హాని చేస్తుందని వారు చేసిన ప్రచారానికి భిన్నంగా ఇప్పుడు డ్యామ్ పరిసర ప్రాంతాలు తీర్థ క్షేత్రంగా మారిపోయాయని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరు తమ తమ రాష్ట్రాలలో ఈ తరహా అర్బన్ నక్సల్స్ సమూహాల వలలో చిక్కుకోకుండా జాగ్రత్త గా ఉండాలని ప్రధాని హెచ్చరించారు. రాష్ట్రాలలో పర్యావరణ పరమైన ఆమోదం కోసం 6,000 కు పైగా ప్రతిపాదన లు, అలాగే ఫారెస్ట్ క్లియరెన్సుల కోసం 6,500 దరఖాస్తులు ఎదురుచూస్తున్నాయని ప్రధాని విచారం వ్యక్తం చేశారు.
‘‘ప్రతి ఒక్క సముచితమైన ప్రతిపాదనను త్వరలోనే ఆమోదించడానికి రాష్ట్రాలు ప్రయత్నించాలి. ఈ విధమైన అనిశ్చిత స్థితి కారణంగా, వేల కొద్దీ కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల పనులు నిలచిపోయి ఉన్న సంగతిని మీరు గుర్తించాలి” అని చెప్పారు. పెండింగు పనుల భారం తగ్గి, క్లియరెన్సులు త్వరితగతిన లభించడానికి పని పరిస్థితుల లో ఒక మార్పును తీసుకు రావలసిన అవసరం ఉందని కూడా ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
పర్యావరణ పరమైన అనుమతి ని ఇవ్వడం లో మనం ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికి ప్రాధాన్యాన్ని, అలాగే నియమాల పాలనకు కూడా పూచీ పడాలని ఆయన తెలిపారు. ‘‘ఇది ఇటు ఆర్థిక వ్యవస్థకు, అటు జీవావరణానికి కూడా గెలుపు అందించే స్థితి అవుతుంది’’ అని ఆయన చెప్పారు. ‘‘పర్యావరణం పేరును అనవసరంగా లేవనెత్తడం ద్వారా ‘ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ల మార్గం లో ఎటువంటి అడ్డంకిని ఎదురు కానీయరాదని స్పష్టం చేశారు.