చండీగఢ్ విమానాశ్రయం పేరును ”భగత్ సింగ్”గా మార్చుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో ఆదివారం ప్రకటించారు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడికి నివాళిగా చండీగఢ్ విమానాశ్రయం పేరును ఇప్పుడు షహీద్ భగత్ సింగ్ గా మార్చుతున్నట్లు తెలిపారు.
భగత్‌సింగ్ జయంతి ఈ నెల 28 న జరగనుండటంతో ప్రధాని ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.“ప్రియమైన దేశ వాసులారా మూడు రోజుల తరువాత సెప్టెంబర్ 28న అమృత్‌మహోత్సవ్‌లో ఒక ప్రత్యేకమైన రోజు. ఆరోజు భరత మాత సాహసపుత్రుడు షహీద్ భగత్‌సింగ్ జయంతి జరుపుకోనున్నాం. భగత్‌సింగ్‌కు నివాళిగా ఒక నిర్ణయం తీసుకున్నాం. చండీగఢ్ విమానాశ్రయానికి భగత్‌సింగ్ పేరు పెడుతున్నాం.” అని మోదీ ప్రకటించారు.
చండీగఢ్ విమానాశ్రయం పేరు మార్చాలంటూ హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాల నుండి వినతులు వచ్చాయని చెప్పారు. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చండీగఢ్ విమానాశ్రయం పేరును భగత్ సింగ్ గా మార్చాలని క్యాబినెట్ తీర్మానం చేసింది.
స్వాతంత్య్ర సమరయోధుడికి నివాళిగా భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్‌లోనే ఆప్ నేత భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. భగవంత్ మాన్ సిఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మార్చి 23ని ప్రభుత్వ సెలవుదినంగా కూడా ప్రకటించారు. దీంతో ఆప్ పార్టీకి వ్యతిరేకంగా బిజెపి ఏకపక్షంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.
చండీగఢ్ విమానాశ్రయ పేరు మార్చాలనే ప్రతిపాదన గతంలోనే వచ్చింది. 2016లోనే హర్యానా ప్రభుత్వం పేరును భగత్ సింగ్ గా మార్చాలని క్యాబినెట్ తీర్మానం చేసింది. ఈ అభ్యర్థనతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు హర్యానా ప్రభుత్వం లేఖలు కూడా రాసింది.
ప్రస్తుతం చండీగఢ్ విమానాశ్రయాన్ని ‘మొహాలీ విమానాశ్రయంగా’ వ్యవహరిస్తున్నారు. ఈ విమానాశ్రయం పేరుపై గతంలో 2017లో రాజ్యసభలో చర్చ కూడా జరిగింది. ఈ విషయమై పంజాబ్- హర్యానా ప్రభుత్వాల మధ్య బేధాభిప్రాయాలు రావడంతో కార్యరూపం జరగలేదు. అయితే గత నెలలో హర్యానా ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేయడం, పంజాబ్ ముఖ్యమంత్రి, హర్యానా ఉప ముఖ్యమంత్రి – ఇద్దరు భగత్ సింగ్ పేరు పెట్టాలని కోరడంతో ఇప్పుడు మార్గం సుగమమైంది.