మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. బెయిల్ మంజూరుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారి నేతృత్వంలోని ధర్మాసనం శివశంకర్‌రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. బెయిల్ ఇచ్చేందుకు తమకు ఎలాంటి కారణాలు కనిపించడంలేదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
దేవిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. వివేకానందరెడ్డి హత్యకేసులో తొలుత దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో శివశంకర్ రెడ్డి పేరు లేదని ఆయన వాదించారు. అప్రూవర్‌గా మారిన వాచ్మెన్ స్టేట్ మెంట్లో కూడా శివశంకరరెడ్డి పేరు లేదని పేర్కొన్నారు.
ఏ1 గా ఉన్న నిందితుడికి మూడు నెలల్లో బెయిల్ ఇచ్చారని, 11 నెలలు అవుతున్నా, ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా శివశంకర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడం లేదని న్యాయవాది విన్నవించారు. కేసు ఛార్జిషీటులో కూడా అతని పేరు లేదని కోర్టుకు విన్నవించారు.
వివేకా హత్య కేసులో కింగ్ పిన్ (కీలకవ్యక్తి) శివశంకర్ రెడ్డేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. శివశంకర్ రెడ్డి నిందితుడు కాదని తాము భావించడం లేదంది. బెయిల్ ఇస్తే.. సాక్ష్యాలు తారు మారు చేస్తారనే అభియోగాలు ఉన్నాయని జస్టిస్ ఎం.ఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి బెంచ్ పేర్కొంది.
అలాంటి ఆధారాలేవీ ఇంతవరకు బయటపెట్టలేదని, సీబీఐ అదనపు ఛార్జీషీట్లో కూడా అతని పేరును ప్రస్తావించలేదని, అప్రూవర్‌గా మారిన వ్యక్తి కూడా తన పేరును చెప్పలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
కాగా, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేస్తూ శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.