దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, అధికారులపై పెరిగిపోతున్న ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం సుపరిపాలన వారంగా సోమవారాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో గ్రామస్ధాయిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్ధను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
గ్రామాలకు సుపరిపాలనను తీసుకెళ్లాలనే నినాదంతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 20 నుంచి రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ‘సుపరిపాలన వారం’ ప్రచారాన్ని ప్రారంభిస్తోంది.
ప్రాథమిక అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా పెండింగ్లో ఉన్న ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడం, రాష్ట్ర స్థాయిలో పౌర పట్టికలను అప్ డేట్ చేయడం దీని ప్రధాన లక్ష్యం. పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ప్రజానుకూలమైన సుపరిపాలనను బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని దీనికి సంబంధించిన ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ అభివృద్ధి గ్రామాల అభివృద్ధిపై ఆధారపడి ఉందని, గ్రామాలను మరింత సమర్థవంతం చేసే గ్రామ స్వరాజ్యం యొక్క కొత్త శకానికి నాంది పలికే పథకాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని తెలిపారు.
మన గ్రామాలను స్వావలంబన, దేశానికి బలమైన మూల స్తంభాలుగా మార్చేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని చెప్పారు. సిటిజన్-ఫస్ట్ విధానం ద్వారా మార్గనిర్దేశం చేసేలా, తమ సేవల పంపిణీ వ్యవస్ధల విస్తరణను మరింత మెరుగుపర్చేందుకు, ప్రభావవంతం చేయడానికి మా ప్రయత్నాలలో అవిశ్రాంతంగా ఉన్నామని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు,