వెనుకబడిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కేంద్రం విశేష కృషి చేస్తోందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి ఎ.నారాయణ స్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఎస్.సి.ల అభివృద్ది కార్యాచరణ ప్రణాళిక అమలుకై కేంద్ర ప్రభుత్వం 2021-22వ ఆర్థిక సంవత్సరంలో 18 శాఖలకు కేటాయించిన రూ.2,837 కోట్ల నిధుల వెచ్చింపు, అభివృద్ది కార్యాచరణ ప్రణాళిక అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
సోమవారం అమరావతిలోని సచివాలయం ఐదో బ్లాక్ లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై శాఖల వారీగా అమలు చేస్తున్న ఎస్.సి.కార్యాచరణ ప్రణాళికల అమలు తీరును సమీక్షించారు.
అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన కేంద్ర సహాయ శాఖ మంత్రి, దేశంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ వారి సంక్షేమం, అభివృద్దికై పలు కేంద్ర్ర పథకాలను అమలు పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయల నిధులను పలు రాష్ట్రాలకు కేటాయిస్తోందని పేర్కొన్నారు. ఇందు కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.1 లక్షా 42 వేల కోట్ల మేర నిధులను కేంద్రం పలు రాష్ట్రాలకు కేటాయించిందని తెలిపారు.
అందులో దాదాపు రూ.2,837 కోట్ల నిధులను ఆంధ్రప్రదేశ్ లోని పలు శాఖలకు కేటాయించామని చెబుతూ వ్యవసాయ శాఖకు రూ.356 కోట్లను, పశుసంవర్థక శాఖకు రూ.120 కోట్లను, ఉన్నత విద్యకు రూ.200 కోట్లను, పాఠశాల విద్యకు రూ.128 కోట్లను, గ్రామీణాభివృద్దికై రూ.52 కోట్లను, పంచాయితీ రాజ్ కు రూ.24 కోట్లను, త్రాగునీరు & పారిశుద్యానికి రూ.14 కోట్లను, స్త్రీ, శిశు సంక్షేమానికి రూ.134 కోట్లను, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమానికి రూ.468 కోట్లను, వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలకై రూ.55 కోట్లతో పాటు గృహ నిర్మాణానికై పెద్ద ఎత్తున నిధులను కేటాయించామని వివరించారు.
కేంద్ర ప్రభుత్వ పథకం జల్ జీవన్ మిషన్ అమల్లో భాగంగా రాష్ట్రంలో 95 లక్షల గృహాలను నేరుగా ట్యాప్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 54 లక్షల గృహాలకు మాత్రమే ట్యాప్ కనెక్షన్ లు ఇవ్వడం జరిగిందని, మిగిలిన వాటికి కూడా త్వరలో ట్యాప్ కెనక్షన్లు ఇవ్వడంతో పాటు సోక్ పిట్స్ కూడా నిర్మించాలని సంబందిత శాఖల అధికారులను ఆదేశించడం జరిగిందని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు.