మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు దేశంలో ఈతరం మహిళల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గడిచిన పదేళ్ల కాలంలో దేశంలో సాధారణ సంతానోత్పత్తి రేటు 20 శాతం పడిపోయిందని శాంపిల్ రిజిస్ట్రేషన్ డేటా 2020 రిపోర్టు వెల్లడించింది.
దేశంలోని ప్రతి వెయ్యి మంది మహిళలకు ఒక ఏడాదిలో జన్మించిన చిన్నారుల సంఖ్యను జనరల్ ఫర్టిలిటీ రేట్ (జీఎఫ్ఆర్)గా చెబుతారు. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్లో జీఎఫ్ఆర్ 29 శాతం తగ్గిపోయిందని రిపోర్టు తెలిపింది. పలు సమస్యల కారణంగా పిల్లలను కనేందుకు మహిళలు వాయిదా వేస్తుండడం కూడా కొంతమేరకు కారణం అవుతున్నట్లు భావిస్తున్నారు
2008 -2010లో సగటు జీఎఫ్ఆర్ 86.1గా ఉంటే, 2018-20 మధ్య కాలంలో ఇది 68.7కు తగ్గింది. చిత్రమేమిటంటే పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పరిస్థితి దారుణంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి క్షీణత 15.6 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 20.2 శాతంగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటును పరిశీలిస్తే ఏపీలో 50.7 శాతం, తెలంగాణలో 52.6 శాతంగా ఉంది. ఇది మంచి సంకేతమేనని ఎయిమ్స్ ఆబ్సెట్రిక్స్ మాజీ హెడ్ సునీతా మిట్టల్ తెలిపారు.
వివాహం చేసుకుంటున్న వారి వయసు పెరగడం, మహిళల్లో అక్షరాస్యత శాతం పెరగడం, ఆధునిక సంతాన నిరోధక సాధనాల రాక సంతానోత్పత్తి తగ్గడానికి కారణాలుగా పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.