అహ్మదాబాద్, ముంబై, న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లను మరింత తీర్చిదిద్దే పనులకు రూ 10,000 కోట్ల వ్యయ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రత్యేకించి స్టేషన్లలలో సదుపాయాల మెరుగుదలకు, ప్రయాణికుల సౌలభ్యానికి ఏర్పాట్లు దిశలో చర్యలు చేపడుతారు. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునికంగా రూపొందించేందుకు డిజైన్ కూడా తయారు చేశారు.
ఇప్పటికే దేశంలో 199 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు పనులు తలపెట్టారు. 47 స్టేషన్లకు సంబంధించి టెండర్లను పిలిచారు. 32 స్టేషన్లలో పనులు వేగంగా సాగుతున్నాయి, మాస్టర్ ప్లానింగ్, డిజైనింగ్ పనులు గురించి ఆలోచిస్తున్నారని కేబినెట్ భేటీ తరువాత రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రతిస్టేషన్‌కు తప్పనిసరిగా ఉండాల్సిన ఏర్పాట్లు గురించి నిర్ధేశించారు. విశాలమైన రూఫ్ ప్లాజా తప్పనిసరి. ఇందులో వివిధ స్టాల్స్‌కు వసతి ఉండాలి, కెఫెటెరియా, విశ్రాంతి వినోద సౌకర్యాలు కూడా సమకూర్చాల్సి ఉంటుంది.
నగరానికి ఇరువైపులా అనుసంధానం అయ్యేలా స్టేషన్ ఏర్పాటు ఉండాలి. రైల్వే ట్రాక్‌లకు ఇరు వైపలా స్టేషన్ బిల్డింగ్లు ఉండాల్సిందే. ఫుడ్‌కోర్టులు, వెయిటింగ్ లాంజ్‌లు , పిల్లలకు ఆడుకునే ప్రాంతాలు తప్పనిసరి. దివ్యాంగులకు సహకరించేందుకు ఫ్రెండ్లీ ఏర్పాట్లు తప్పనిసరి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు
దసరా పండగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం కరవు భత్యం పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2022 జులై 1 నుంచి ఈ పెంపు అమలు చేస్తారు. ఇందువల్ల 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది.
పెంచిన డీఏతో ప్రభుత్వంపై రూ.6591.36 కోట్ల అదనపు భారం పడుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (సీసీఈఏ ) సమావేశంలో ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు.