తెలంగాణలో శాంతిభద్రతల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. బెంగాల్, తమిళనాడు సహా.. పక్క రాష్ట్రాలకు కేసీఆర్ గులాంగిరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ లేని సమస్యను సృష్టిస్తున్నారని విమర్శించారు. ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కేంద్రమంత్రి పియూష్ గోయల్ రాజ్యసభ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని సంజయ్ హెచ్చరించారు.
పార్లమెంట్లో ఆందోళన చేసిన టీఆర్ఎస్ ఎంపీలు తోకముడిచారెందుకు? అని ప్రశ్నించారు. బెంగాల్లో నాలుగు స్థానాల నుంచి 77 సీట్లు సాధించినట్లే.. తెలంగాణలో టీఆర్ఎస్పై కొట్లాడుతామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్కు చావు డప్పులు కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు డిమాండ్‌తో ఈనెల 27న ఇందిరా పార్క్ వద్ద ఒక్క రోజు దీక్ష చేస్తామని సంజయ్ ప్రకటించారు. నిరుద్యోగులతో పాటు దీక్షలో పాల్గొంటానని ఆయన చెప్పారు. ఉద్యోగ సంఘలా నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారో చెప్పాలి? అని నిలదీశారు.
సీఎం కేసీఆర్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ నియమించిన బిస్వాల్ కమిటీ తెలంగాణలో లక్ష 92 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తేల్చిందని బండి సంజయ్ తెలిపారు.
నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
ఇంటర్ ఫలితాలలో మార్కులు తక్కువొచ్చాయని ఆత్మహత్యలు చేసుకొని నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బండి సంజయ్ సూచించారు. మూడు రోజుల క్రితం విడుదలైన ఇంటర్ ఫలితాలలో 51 మంది విద్యార్థులు ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురై ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం కారణంగానే ఇంటర్ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఫెయిలైన విద్యార్థుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనం అని చెప్పారు.
తమ చావుకు ప్రభుత్వం, కేటీఆర్ కారణమంటూ స్వయంగా విద్యార్ధి ట్వీట్ చేయడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తల దించుకోవాలని దుయ్యబట్టారు. గతంలో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా నిర్వాకంతో 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు బలయ్యారని గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి? అని ప్రశ్నించారు.
విద్యార్థుల ఆత్మహత్యలు, పరీక్షల్లో ఫెయిలవడానికి ప్రభుత్వం బాధ్యత వహించి తీరాల్సిందే అని సంజయ్ స్పష్టం చేశారు. విద్యార్థులందరికీ ఉచితంగా రీ వాల్యుయేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని స్పష్టం చేశారు. విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందని, అవసరమైతే న్యాయపోరాటం చేసేందుకూ వెనుకాడబోమని సంజయ్ హెచ్చరించారు.