ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ. 3400 కోట్లకు పైగా విలువ కలిగిన వేరు వేరు ప్రాజెక్టుల కు సూరత్ లో శంకుస్థాపన చేయడంతో పాటుగా దేశ ప్రజలకు అంకితం కూడా చేశారు. ఆ ప్రాజెక్టులలో నీటి సరఫరాకు ఉద్దేశించిన పనులు, మురుగునీటి పథకాలు, డ్రీమ్ సిటీ, బయోడైవర్సిటీ పార్కు, పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, వారసత్వ పునరుద్ధరణ, సిటీ బస్/ బిఆర్ టిఎస్ సంబంధి మౌలిక సదుపాయాలు, విద్యుత్తు వాహనాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు వంటివి ఉన్నాయి.
రహదారి మౌలిక సదుపాయాల పనుల తాలూకు ఒకటో దశను, డాయమండ్ రిసర్చ్ ఎండ్ మర్కంటైల్ (డిఆర్ఇఎఎమ్ – డ్రీమ్) సిటీ ప్రధాన ప్రవేశ ద్వారాన్ని ప్రారంభించారు. సూరత్ లో శరవేగంగా వృద్ధి చెందుతున్న వజ్రాల క్రయ విక్రయాల వ్యాపారానికి పూరకంగా ఉండేటట్లుగా వాణిజ్య భవనాలను, నివాస భవనాలను ఏర్పాటు చేయాలన్న డిమాండును నెరవేర్చడం కోసం ప్రారంభించిందే ఈ డ్రీమ్ సిటీ ప్రాజెక్టు. ప్రాజెక్టు రెండో దశకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.
ప్రధాన మంత్రి బయోడైవర్సిటీ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ పార్కును డాక్టర్ హెడ్గేవార్ వంతెన నుండి భీమ్ రాడ్-బమ్ రోలీ వంతెన వరకు విస్తరించి ఉన్న 87 హెక్టేర్ లకు పైగా స్థలంలో నిర్మించడం జరుగుతోంది. సూరత్ లోని సైన్స్ సెంటర్ లో ఖోజ్ మ్యూజియమ్ ను కూడా ప్రారంభించారు. బాలల కోసం నిర్మించినటువంటి ఈ మ్యూజియమ్ లో ఇంటరాక్టివ్ డిస్ ప్లే స్, అడిగి తెలుసుకొనే పద్ధతిపై ఆధారపడిన కార్యకలాపాలు, ఆసక్తి ఆధారిత అన్వేషణ లు చోటు చేసుకోనున్నాయి.
ప్రస్తుతం, ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరాల సరసన సూరత్ స్థానాన్ని సంపాదించుకొందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెబుతూ ఇది అంటువ్యాధులకు, వరదలకు ఈ నగరం మారుపేరు అనేటటువంటి అపఖ్యాతిని తెచ్చుకొన్న కాలం కంటే చాలా భిన్నమైందని తెలిపారు. సూరత్ నాగరిక జీవనం లో బయోడైవర్సిటీ పార్కు తీసుకురాగల ప్రయోజనాలను గురించి ఆయన సమగ్రంగా తెలిపారు.
నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ నగరం నుండి విమానాశ్రయానికి దారి తీసే రహదారి ఈ నగరం సంస్కృతికి, సమృద్ధికి, ఆధునికత్వానికి అద్దం పడుతోందని తెలిపారు. అప్పట్లో దిల్లీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ నగరానికి ఒక విమానాశ్రయం ఏర్పడవలసిన అవసరాన్ని గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
‘‘చూడండి ఇవాళ, ఎన్ని విమాన సర్వీసులు ఇక్కడ నుండి నడుస్తున్నాయో, ఎంత మంది రోజూ ఇక్కడకు విచ్చేస్తున్నారో ’’ అని ప్రధాన మంత్రి చెప్పారు. సూరత్ మెట్రో కు ఆమోదం అవసరపడిన వేళ సైతం ఇటువంటి స్థితే తలెత్తింది అని కూడా మోదీ గుర్తుకు తెచ్చారు.