బిగ్ బాస్ రియాల్టీ షోను బ్యాన్ చేయాలని దాఖలైన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి తెలిపారు. ఐబీఎఫ్ గైడ్ లైన్స్ ప్రకారం సమయాన్ని పాటించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకే బిగ్ బాస్ షో ప్రసారం చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఈ సందర్భంగా బిగ్‌బాస్‌లో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. టివి షోలు ఇండియన్ ’బ్రాడ్ క్రాస్టింగ్ ఫౌండేషన్ (ఐబిఎఫ్) నిబంధనలు పాటించడం లేదని తెలిపారు. దీనిపై స్పందించడానికి కేంద్రం తరపున న్యాయవాది సమయం కోరారు.
బిగ్‌బాస్‌లో అశ్లీలతపై ఎపి హైకోర్టు ఘాటుగా స్పందించింది. 1970లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని తెలిపిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులపై తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని పేర్కొంది. పాతకాలంలో సినిమాలు సందేశాత్మకంగా ఉండేవని, ప్రస్తుతం సినిమాలో బూతులు, కొట్టుకోవడం, విద్వేషాలు రెచ్చగొట్టుకోవడం తప్ప ఏముందని ప్రశ్నించింది. కుటుంబసభ్యులతో కలిసి కూర్చొని సినిమాలు చూసే పరిస్థితి ఉందా? అని ఆవేదన వ్యక్తం చేసింది.
దురదృష్టవశాత్తు చదువులేని వారు చట్టాన్ని గౌరవిస్తున్నారని, ఉన్నత విద్యావంతులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడతున్నారని వ్యాఖ్యానించింది. యూరోపియన్ దేశాల్లో వ్యవస్థ వ్యక్తులను కంట్రోల్ చేస్తుంటే.. మనదేశంలో మాత్రం వ్యక్తులు వ్యవస్థను కంట్రోల్ చేస్తున్నారని వ్యాఖ్యానించింది. విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది. అశ్లీలత ఎక్కువగా ఉందని కోర్టుకు వివరించారు.
బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయాలంటూ కొద్ది రోజులుగా డిమాండ్ వినిపిస్తోంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, సిపిఐ నేత నారాయణలు బిగ్‌బాస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ రియాల్టీ షో కాదని.. బూతు షో అని వ్యాఖ్యానించారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఈ షో చూడలేని పరిస్థితి ఉందని, అశ్లీలతతో ఉందన్నారు. ఈ షో తో సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని మండిపడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.