నిత్యావసర వస్తువుల అక్రమ రవాణా, వాహనాల జప్తు వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు డిజిపి రాజేంద్రనాథ్‌రెడ్డి శుక్రవారం ఏపీ హైకోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. నిత్యవసర వస్తువుల చట్టం (ఇసి) ప్రకారం అక్రమ రవాణా జరిగే వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఇన్స్పెక్టర్కే ఉంటుందని, అంతకంటే తక్కువ స్థాయి అధికారులు లేదా సిబ్బంది జప్తు చేస్తే అవి చట్ట నిబంధనలకు వ్యతిరేకమని ఆయన హైకోర్టుకు తెలియజేశారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో బ్లాక్ మార్కెటీర్లతో పోలీసులు కుమ్మక్కైనట్లు కనిపిస్తోందని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రేషన్ బియ్యం సీజ్ చేసిన తరువాత స్వతంత్ర వ్యక్తులు లేకుండా పంచనామాను ప్రభుత్వ అధికారులే నిర్వహిస్తుండడం ఇందుకు బలం చేకూరుస్తోందని పేర్కొంది.
పంచనామాపై వీఆర్వోలు, మహిళా పోలీసులతో సంతకాలు ఎలా చేయిస్తారని నిలదీసింది. చట్టంలో నిర్దేశించిన అధికారులు కాకుండా ఇతరులు బియ్యం అక్రమ రవాణా వాహనాలను జప్తు చేస్తూ నమోదు చేసే కేసులు న్యాయస్థానం ముందు ఎలా నిలబడతాయని ప్రశ్నించింది. అధికారులు, పోలీసులు నిబంధనల మేరకు నడుచుకోకపోడంతో 90శాతం కేసులు కోర్టు ముందు వీగిపోతున్నాయని గుర్తు చేసింది.
రాష్ట్రం నుంచి పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం ఇతర దేశాలకు తరలివెళ్తోందని, ఏ పోర్టు నుంచి బియ్యం రవాణా చేస్తున్నారో పోలీ్సబా్సగా మీకు సమాచారం ఉండే ఉంటుందని డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా డీజీపీ సర్క్యులర్ జారీచేసినా కిందిస్థాయి అధికారులు పట్టించుకోకపోడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించింది.
అక్రమ రవాణా వాహనాలను ఎవరు తనిఖీ చేయాలో, ఎవరికి జప్తు చేసే అధికారం ఉందో సమగ్రంగా సర్క్యులర్ ఇచ్చినట్లు డిజిపి చెప్పారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ సర్క్యులర్ అమలయ్యేలా జిల్లా ఎస్పిలు బాధ్యత తీసుకుంటారని తెలిపారు. ఇకపై ఉల్లంఘనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టే విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకోసం ఉత్తర్వులు జారీచేయడంతో మీ పని పూర్తి కాదని….. వాటి అమలు తీరును పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా డీజీపీ కార్యాలయం పై ఉందని స్పష్టం చేసింది. బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వాహనాల సీజ్ చేయడం, కేసులు నమోదు చేసే వ్యవహారంలో కోర్టు ఆదేశాలను తూచతప్పకుండా పాటించేలా కిందిస్థాయి అధికారులను ఆదేశించాలని కోరింది.
నంద్యాల జిల్లా పాములపాడు పోలీసులు పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరిగే వాహనాలను జప్తు చేయడంపై షేక్ మహ్మద్ దాఖలు చేసిన రిట్‌ను జస్టిస్ బి దేవానంద్ శుక్రవారం విచారణ జరిపారు. డిజిపి ఆదేశాలు అమలు కాకపోవడంపై గతంలో ఆదేశించిన మేరకు డిజిపి స్వయంగా విచారణకు హాజరయ్యారు.
పాములపాడు ఎస్ఐ, ఎఎస్ఐను సస్పెండ్ చేసినట్లు డిజిపి తరపున అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ తెలిపారు. పట్టుబడిన పిడిఎస్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందని, ఏ పోర్టుకుచేరుతోందో డిజిపికి తెలిసే ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వివరణ కోసమే వ్యక్తిగతంగా హాజరీకి పిలిచామని, ఇదేమీ శిక్ష కాదని చెప్పారు. డిజిపి హామీని నమోదు చేసుకును న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.