కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలుకు చివరి రోజైన శుక్రవారం నామినేషన్లు వేసిన మాజీ కేంద్ర మంత్రులు మల్లిఖార్జున్ ఖర్గే, శశి థరూర్ల మధ్యనే పోటీ ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. జార్ఖండ్ నేత కేఎన్ త్రిపాఠి కూడా అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసినా ఆయనను ఎవ్వరు లెక్కలోకి తీసుకోవడం లేదు.
నామినేషన్ వేసిన తర్వాత శశి థరూర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల తనకు ఒక విజన్ ఉందని, దాన్ని ప్రతినిధులకు తెలియజేయనున్నట్లు వెల్లడించారు. పార్టీ కార్యకర్తల మద్దతు తీసుకుంటానని, అందరి అభిప్రాయాలకు తాను స్వరంగా మారనున్నట్లు చెప్పారు.
నిర్ణయాలను తీసుకునే విధానాన్ని కాంగ్రెస్ ఏకీకృతం చేసిందని, ఆ వ్యవస్థను బ్రేక్ చేయాలని, కొందరు ఓ వ్యక్తిని ఏకగ్రీవం చేశారని, కానీ దానికి తాను వ్యతిరేకిని అని స్పష్టం చేయడం ద్వారా పార్టీపై `గాంధీ కుటుంభం’ ఆధిపత్యంను దిక్కరిస్తున్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చారు.
మల్లిఖార్జున్ ఖర్గే నామినేషన్ పత్రంపై 30 మంది సీనియర్ నేతలు సంతకాలు చేశారు. ఏకే ఆంటోనీ, అశోక్ గెహ్లాట్, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, అజయ్ మాకెన్లు ఖర్గేకు ఆయనకు మద్దతు పలికారు. వారంతా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మద్దతుదారులు కాడంతో `గాంధీ కుటుంభం’ అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.
నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో తనకు తోడుగా అనేక మంది నేతలు, ప్రతినిధులు వచ్చారని, వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతున్నట్లు ఖర్గే తెలిపారు. అక్టోబర్ 17న ఫలితాలు వస్తాయని, గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచే కాంగ్రెస్ ఐడియాలజీకి కనెక్ట్ అయి ఉన్నానని, స్కూల్కు వెళ్తున్న రోజుల్లో గాంధీ, నెహ్రూ ఐడియాలజీ తరపున ప్రచారం చేసేవాడినని ఖర్గే చెప్పారు.
కాగా, అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నట్లు గురువారం ప్రకటించిన దిగ్విజయ్ సింగ్ రాత్రికి ఖర్గే అభ్యర్థిత్వం రంగంపైకి రావడంతో శుక్రవారం ఆయన పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంటే `గాంధీ కుటుంభం’ నిర్ణయం మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి అవుతున్నది.
ఖర్గేకే తన మద్దతు ఉంటుందని దిగ్విజయ్ స్పష్టం చేశారు. కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు ఖర్గే పోటీలోకి దిగినట్లు తెలుస్తోంది. మొదటి నుండి `గాంధీ కుటుంభం’ అభ్యర్థిగా ప్రచారం పొందిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అనూహ్యంగా పోటీనుండి తప్పుకోవడమే కాకుండా, నామినేషన్ల సమయంలో ఎక్కడా కనిపించలేదు. పైగా, ఆయనను ముఖ్యమంత్రి పదవి నుండి కూడా తప్పించాలనే ప్రయత్నం ప్రారంభమైనట్లు తెలుస్తున్నది.
నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయంలో చిట్ట చివరి క్షణంలో మల్లికార్జున ఖర్గే అభ్యర్థిత్వం తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరచింది. నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్ రోజుకు 16 నుంచి 18 గంటలపాటు పని చేస్తున్న సమయంలో కాంగ్రెస్కు నూతన జవసత్వాలను అందించడంలో ఎనభయ్యేళ్ళ ఖర్గే ఏ మేరకు విజయవంతమవుతారో చూడాలని విశ్లేషకులు అంటున్నారు.
ఖర్గే ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు లోక్సభ సభ్యునిగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. గతంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పని చేశారు.