కేరళలో కేవలం 12 గంటల వ్యవధిలో బిజెపి, ఎస్డీపీఐ నేతల హత్యలు హత్యలకు గురవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలప్పుజలో ఈ రోజు ఉదయం బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ను గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపారు.
ఆదివారం ఉదయం ఆయన ఇంటి దగ్గర కుటుంబ సభ్యుల ఎదుటనే ఎనిమిది మంది వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో పొడిచి పరారయ్యారు. దీంతో హుటాహుటీన ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు.
అలప్పుజ జిల్లాలోనే నిన్న (శనివారం) రాత్రి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్ (38)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అలప్పుజ నుంచి మన్నచేరిలో ఉన్న తన ఇంటికి స్కూటీపై వెళ్తుండగా కొంత మంది కారులో వచ్చి ఢీకొట్టారు. ఆ తర్వాత కింద పడిన షాన్పై కత్తులతో దాడి చేసి పరారయ్యారు.
తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న ఆయనను ఎర్నాకులంలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ లాభం లేకపోయింది. శరీరంలో దాదాపు 40 గాయాలయ్యాయని, అతడిని ప్రాణాలతో కాపాడలేకపోయామని డాక్టర్లు తెలిపారు.
ఈ రెండు ఘటనలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. ఇలాంటి చర్యలను తమ ప్రభుత్వం సహించదని, ఈ హత్యల వెనుక ఎవరున్నా తమ ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని చెప్పారు. అయితే ఒకే జిల్లాలో రెండు రాజకీయ హత్యలు జరిగిన నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు 144 సెక్షన్ విధించినట్లు ఆ జిల్లా కలెక్టర్ అలెగ్జాండర్ తెలిపారు.
శ్రీనివాసన్ మృతిపై కేంద్ర మంత్రి వి.మురళీధరన్ మాట్లాడుతూ.. తమ పార్టీ నేతను ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టుల గ్రూప్ హత్య చేసిందని ఆరోపించారు. శ్రీనివాసన్ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు చేసి నేరస్తులను శిక్షించాలని తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా అతను పోటీచేశాడు.